పెన్షనర్ల సమస్యలపై ఉదాసీన వైఖరి

సుదీర్ఘ కాలం పాటు

ధర్నాకు సంఘీభావం తెలుపుతున్న పురుషోత్తం నాయుడు

  • సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి
  • కలెక్టరేట్‌ వద్ద పెన్షనర్ల ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వ ఉదాసీన వైఖరి తగదని ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు, జెఎసి జిల్లా చైర్మన్‌ హనుమంతు సాయిరాం అన్నారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ స్టేట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన పెన్షనర్లు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన అనంతరం వారు మాట్లాడుతూ పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చాలీచాలని వేతనాలతో కనీస పెన్షన్‌తో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ అమలు చేయాలని కోరారు. 2018 నుంచి డిఎ బకాయిలు 2022 నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన పిఆర్‌సి ఎరియర్స్‌ బకాయిలు ఏకమొత్తం విశ్రాంత పెన్షనర్లకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికి పెన్షనర్లు చేపట్టే ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. స్టేట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.రామచంద్రరావు, ఎ.ధర్మారావు మాట్లాడుతూ పెరుగుతున్న ధరల నేపథ్యంలో పెన్షన్‌ కోసం ఎదురుచూసే పరిస్థితులు కల్పించవద్దన్నారు. పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పూర్తి బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇహెచ్‌ఎస్‌ ద్వారా ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునేందుకు అనుమతించాలని కోరారు. ధర్నాలో ఎన్‌జిఒ అసోసియేషన్‌ నాయకులు ఆర్‌.వేణుగోపాల్‌, బి.పూర్ణచంద్రరావు, ఎస్‌జిపిఎ శ్రీకాకుళం అసోసియేషన్‌ కోశాధికారి బొడ్డేపల్లి మోహనరావు, మహిళా విభాగం అధ్యక్షులు ఎం.ప్రభావతి, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.వి.రమణ, జాయింట్‌ సెక్రటరీ ఢిల్లేశ్వరరావు, బి.సూర్యప్రకాష్‌, జి.వి.రమణ, జానకిరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️