మున్సిపల్‌ కార్మికులపై ప్రభుత్వ నిర్లక్ష్యం

మున్సిపల్‌ కార్మికుల

శ్రీకాకుళం అర్బన్‌ : మాట్లాడుతున్న గోవిందరావు

  • కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలి
  • సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు
  • చెవిలో పువ్వులతో కార్మికుల నిరసన

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం

మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు విమర్శించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులు మోకాళ్లపై కూర్చొని గురువారం నిరసన తెలిపారు. సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించిన గోవిందరావు మాట్లాడుతూ మున్సిపల్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. జిఒ నంబరు 7ప్రకారం క్లాప్‌ ఆటో డ్రైవర్లకు నెలకు రూ.18,500 వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆప్కాస్‌ కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రాట్యుటీ, పెన్షన్‌ ఇవ్వాలన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులకు సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం, ఉపాధ్యక్షులు ఎ.గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆర్ట్స్‌ కళాశాల రోడ్డులోని వాటర్‌ ట్యాంకు వద్ద నగరపాలక సంస్థ అధికారులు ఆర్‌టిసి డ్రైవర్లతో వాహనాలు తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను కార్మికులు అడ్డుకున్నారు. ఇచ్ఛాపురంలో మున్సిపల్‌ కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. పలాసలో కాశీబుగ్గ గాంధీ విగ్రహం నుంచి పలాస ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వరకు అక్కడ్నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, సిపిఐ నాయకులు చాపర వేణుగోపాల్‌, యూనియన్‌ నాయకులు అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.మురుగన్‌, ఎం.రవి తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలసలో సమ్మె శిబిరంలో యూనియన్‌ నాయకులు టి.సంతోష్‌, జె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️