రైతులపై బిజెపి ప్రభుత్వ దుర్మార్గం

పంటలకు కనీస మద్దతు

నిరసన తెలుపుతున్న నాయకులు

ప్రజాశక్తి పలాస

పంటలకు కనీస మద్దతు ధర కోసం పోరాడుతున్న రైతులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు విమర్శించారు. రైతు ఉద్యమంపై బిజెపి ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా పలాస-కాశీబుగ్గ పాతబస్టాండ్‌లోని గాంధీ విగ్రహం వద్ద రైతు, కార్మిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పోలీసులతో చేయించిన కాల్పుల్లో యువ రైతు శుభకరణ్‌ సింగ్‌ను బలిగొన్నారని చెప్పారు. ఇంతకముందు మరో రైతు గుండెపోటుతో మరణించారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ నాయకులు సిహెచ్‌.సుందర్‌లాల్‌, ఎఐకెఎంఎస్‌ జిల్లా కార్యదర్శి వి.మాధవరావు, లిబరేషన్‌ నాయకులు, టి.సన్యాసిరావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డాక్టర్‌ డి.జీవితేశ్వరరావు మాట్లాడుతూ అన్నం పెట్టే రైతన్నను అధోగతి పాలు చేసే కేంద్ర ప్రభుత్వాన్ని, దానికి వత్తాసు పలుకుతున్న పార్టీలను ప్రజలు భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు సిహెచ్‌.వేణుగోపాల్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, కాంగ్రెస్‌ నాయకులు కె.హేమారావుచౌదరి, ఎఐసిసిటియు నాయకులు డి.శ్రీనివాస్‌, పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి ఎం.వినోద్‌కుమార్‌, ఎఐవైఎఫ్‌ నాయకులు జి.భాస్కరరావు, ఎం.రామారావు పాల్గొన్నారు.

➡️