లెనిన్‌ స్ఫూర్తితో సమరశీల పోరాటాలు

తొలి సోషలిస్టు విప్లవాన్ని సాధించిన

లెనిన్‌ చిత్రపటానికి నివాళ్లర్పిస్తున్న సిపిఎం నాయకులు

  • సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

తొలి సోషలిస్టు విప్లవాన్ని సాధించిన మహా విప్లవ నేత లెనిన్‌ స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. సిపిఎం నాయకులు కె.శ్రీనివాసు అధ్యక్షతన నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో లెనిన్‌ శత వర్థంతి సభను ఆదివారం నిర్వహించారు. లెనిన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రామిక వర్గ విప్లవ నేత, 20వ శతాబ్దపు గొప్ప మార్క్సిస్టు మేధావి, ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రామికవర్గ రాజ్యం సోవియట్‌ యూనియన్‌ను సాధించిన ఘనత లెనిన్‌ నాయకత్వానికి దక్కుతుందన్నారు. కష్టపడి సంపద సృష్టించే రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, వృత్తిదారులు తదితరులకే సంపదపై అధికారం ఉండాలని, అలాంటి వారికే రాజ్యాధికారం కావాలని పోరాడారని తెలిపారు. అసమానతల్లేని సోషలిస్టు సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని చెప్పారు. పెట్టుబడిదారీ దోపిడీకి విరుగుడు సోషలిజమేనని ఆయన ఆచరణలో రుజువు చేశారని తెలిపారు. ప్రజల సంపద కార్పొరేట్ల పాలవుతున్న ప్రస్తుత కాలంలో లెనిన్‌ ఆవశ్యకత మరింత పెరిగిందన్నారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని లెనిన్‌ గట్టిగా బలపరిచారని గుర్తుచేశారు. సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆనాటి సామాజిక ఉద్యమాలను ఆయన ప్రత్యేకంగా గమనంలోకి తీసుకున్నారని చెప్పారు. లెనిన్‌ సిద్ధాంతం దేశ అభ్యున్నతికి, యువత బంగారు భవిష్యత్‌కు మార్గదర్శకం అవుతుందన్నారు. లెనిన్‌ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభలో సిపిఎం నాయకులు కె.మోహనరావు, వి.జి.కె మూర్తి, ఎస్‌.భాస్కరరావు, కె.అప్పారావు, కె.నాగమణి, ఎ.మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.టెక్కలి రూరల్‌ : టెక్కలిలో సిపిఎం కార్యాలయంలో కె.ధర్మారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో లెనిన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి మాట్లాడారు. సభలో సిపిఎం నాయకులు కె.కామేశ్వరరావు, ఎన్‌.షణ్ముఖరావు, కొల్లి ఎల్లయ్య, బగాది వాసు తదితరులు పాల్గొన్నారు.పలాస : మండలంలోని మామిడిపల్లిలో లెనిన్‌ చిత్రపటానికి సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ రాష్ట్ర నాయకులు బొడ్డు వాసుదేవరావు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మద్దిల రామారావు, ఎఐసిసిటియు రాష్ట్ర నాయకులు పిన్నింటి నాగేశ్వరరావు, ఎఐకెఎం జిల్లా నాయకులు వంకల అప్పయ్య, ఐప్వా నాయకులు కె.ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️