వైసిపిని గద్దె దించితేనే రాష్ట్రాభివృద్ధి

వచ్చే ఎన్నికల్లో

మాట్లాడుతున్న టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

  • టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, సరుబుజ్జిలి, బూర్జ

వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపితే తప్ప రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో, సరుబుజ్జిలి మండల కేంద్రంలోని ఒక కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన జయహో బిసి కార్యక్రమంలో మాట్లాడారు. నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దెబ్బతిని వేలాది మంది ఇతర రాష్ట్రాలకు వలసలు పోవాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ అనుచరుల సొంత, బినామీ కంపెనీల్లో తయారు చేసిన నాసిరకం మద్యం అమ్మకాలు సాగిస్తూ ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానని చెప్పిన జగన్‌, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నారని ప్రశ్నించారు. ప్రజలపై పన్నులు, ధరల భారాన్ని మోపారని ధ్వజమెత్తారు. బిసిలకు ఏటా రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తామని నమ్మబలికిన జగన్‌, కార్పొరేషన్లుగా విభజించి పార్టీ నాయకులకు పదవులు ఇచ్చి ఉత్సవ విగ్రహాలుగా నిలిపారన్నారు. కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. చివరకు సబ్‌ప్లాన్‌ నిధులను దళితుల ప్రయోజనాలకు ఇవ్వకుండా దారిమళ్లించారని విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో వైసిపి నాయకుల మోసపూరిత ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బిసిలు వైసిపికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టిడిపి సరుబుజ్జిలి మండల అధ్యక్షులు ఎ.రాంబాబు, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, బిసి సెల్‌ కార్యదర్శి బోర గోవిందరావు, జిల్లా అధ్యక్షులు కలగ జగదీష్‌, టిడిపి రాష్ట్ర కార్యదర్శి శివ్వాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.అలాగే బూర్జ మండలం డొంకలపర్త, నీలాపురం, అల్లెన, బూర్జ గ్రామాల్లో రవికుమార్‌ విస్తృతంగా పర్యటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు ఎ.రామకృష్ణ, గణపతి పాల్గొన్నారు.

 

 

➡️