సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె విరమణ

సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌

మాట్లాడుతున్న మురళీకృష్ణ

  • నేటి నుంచి విధుల్లోకి…
  • జెఎసి అధ్యక్షులు మురళీకృష్ణ వెల్లడి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలు ఫలించడంతో నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఉద్యోగుల జెఎసి జిల్లా అధ్యక్షులు పి.మురళీకృష్ణ తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్రశిక్ష, కెజిబివి ఉద్యోగులు 22 రోజుల పాటు నిర్వహించిన నిరవధిక సమ్మెను విరమించారు. నిరవధిక సమ్మెలో భాగంగా కలెక్టరేట్‌ సమీపాన జ్యోతిరావు పూలే పార్కు వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరంలో గురువారం మాట్లాడారు. శుక్రవారం నుంచి యధావిధిగా విధుల్లో చేరుతున్నట్లు రాష్ట్ర ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులు, అధ్యక్షులు ఎ.వి నాగేశ్వరరావు, బి.కాంతారావు నుంచి వచ్చిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జెఎసి నాయకులు ప్రకటించారన్నారు. 2017 నుంచి వేతనాలు పెరగని అన్ని క్యాడర్లకు 23 శాతం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు ఇస్తారని తెలిపారు. రానున్న కాలంలో అన్ని కేడర్లకు వేతనాలను ఒకేసారి పెంచేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిపారు. 0-5, 5-10, 10-15 సర్వీసులో ఉన్న వారి సంఖ్యను గుర్తించి ఎంటిఎస్‌ అమలుపై నిర్ణయిస్తారన్నారు. జాబ్‌ఛార్టు లేని కేడర్లకు జాబ్‌ఛార్టు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు వివరించారు. ఖాళీల భర్తీల్లో డైలీవేజ్‌, స్టాఫ్‌ గ్యాప్‌, గెస్ట్‌ ఉద్యోగులకు ప్రాధాన్యతనిస్తారన్నారు. సమ్మె వల్ల తొలగింపబడిన వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుని వేతనాలు చెల్లిస్తారన్నారు. రెగ్యులరైజేషన్‌, చైల్డ్‌కేర్‌ లీవ్‌లు, నెలనెలా వేతనాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వివరించారు. ఉద్యోగ విరమణ వయసును కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వయోపరిమితిని 60 ఏళ్లకు కొనసాగిస్తూ కెజిబివి రేషనలైజేషన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన పిజిటి తెలుగు, ఇంగ్లీష్‌ విషయంలో పిఎబిలో ఈ రెండు పోస్టులు చేర్చనున్నట్లు వివరించారు. క్యాడర్‌వైజ్‌ సమస్యలను పరిష్కరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. సమావేశంలో జెఎసి ప్రధాన కార్యదర్శి పి.తవిటినాయుడు, డి.శ్రీనివాసరావు, గిరిధర్‌, గౌరీశంకర్‌, ఉషాబాల, అరుణ కుమారి, జ్యోతి పాల్గొన్నారు.

 

➡️