సామాజిక న్యాయం కోసం పోరాటం

Jan 19,2024 15:16 #srikakulam
anganwadi workers strike 39th day sklm

ప్రజాశక్తి-ఎచ్చెర్ల : ముఖ్యమంత్రి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఎచ్చెర్లలో అంగన్వాడీలు అంబేద్కర్ విగ్రహం ముందు సత్యాగ్రహం చేపట్టారు. ముందుగా ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం, యావత్ జీవితం పోరాడిన డా॥ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించడాన్ని హర్షిస్తున్నామని తెలిపారు. అయితే ఏ సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడారో దానికోసం ఈరోజు అంగన్వాడీలు గత 39 రోజులుగా సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రధానమైన జీతాల పెంపు కోర్కెలను తిరస్కరిస్తూ వచ్చిందని అన్నారు. లక్ష మందికి పైగా ఉన్న మహిళలకు న్యాయం చేయకుండా సామాజిక న్యాయం చేస్తామనడంలో అర్ధం లేదని అన్నారు.
ముఖ్యమంత్రి ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేసారు. గత నాలుగు సంవత్సరాలుగా అనేక రకాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో చట్టబద్ధంగా సమ్మె చేపట్టారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గుర్తించ తగ్గ అంగన్వాడీల ఉద్యమం 39 రోజులుగా కొనసాగుతుందని కొనియాడారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలపై సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని, మహిళలని చూడకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించిందని, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు ఇచ్చిందని అన్నారు. ఈ విధమైన వైఖరి ముఖ్యమంత్రికి తగదని అన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వై.విజయలక్ష్మి, యు.శారద, కె.ధనలక్ష్మి, ఎమ్.రాధిక, కె.లలిత, బి.కనకం, ఉమామహేశ్వరి, రామలమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️