కార్మిక, ప్రజాసంఘాల రాస్తారోకో – అరెస్టులు

Jan 20,2024 13:16 #srikakulam
anganwadi workers strike 40th day mass org rastaroko sklm

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంపుదల చేస్తూ వెంటనే ప్రకటన చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కార్మిక,ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జనవరి 17 నుంచి విజయవాడలో ప్రాణాలకు తెగించి అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు శ్రీకాకుళం డే &నైట్ బ్రిడ్జి వద్ద కార్మిక సంఘాలు , ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు రాస్తారోకో లో పాల్గొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ షణ్ముఖరావు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే మోహనరావు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కే నాగమణి ఐద్వా జిల్లా కన్వీనర్ ఏ లక్ష్మి తో పాటు 13మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి 2వ పట్టణ పోలీసు స్టేషనుకు తరలించారు.ఈ సందర్భంగా కార్మిక, ప్రజా సంఘాలు నాయుకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1,10,000 మంది అంగన్వాడి అక్క చెల్లెమ్మలు గత 40 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. పండగ రోజుల్లో కూడా వేలాదిమంది అంగనవాడి రోడ్డుపై కొచ్చి పోరాటం చేస్తున్న ప్రభుత్వంలో చలనంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెను ఎస్మాపరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేదించడం అప్రజాస్వామికని అన్నారు. న్యాయబద్ధమైన సమ్మెను బెదిరింపుల ద్వారా, నిరంకుశ చర్యలతో విచ్ఛిన్నం చేయాలనుకోవడం పచ్చి నియంతృత్వమని అన్నారు. సమ్మె హక్కు కార్మికుల హక్కుని చట్ట ప్రకారం 15 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెకు వెళ్వారని అన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని, జీతాలు పెంచాలని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోని స్థితిలో సమ్మె చేపట్టారని తెలిపారు. నోటీసులు ఇవ్వడం, ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించడం, నిర్బంధం ప్రయోగించడం వంటి చర్యలు మానుకోవాలని ప్రభుత్వానికి హితవుపలికారు. అంగన్వాడీ అక్కచెల్లెమ్మలపై ప్రేమ ఉందని చెప్పే ముఖ్యమంత్రి వారిని రొడ్డున పడేయడం సిగ్గుచేటన్నారు. అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి కార్మిక, ప్రజా సంఘాలు తరుపున సంపూర్ణ మద్దతు అందిస్తామని అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఉద్యమాన్ని అణిచివేయడానికి నిరంకుశ వైఖరి కొనసాగిస్తే రానున్న ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేసారు. అంగన్వాడీలపై బెదిరింపులు వెంటనే ఆపాలని, ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు,ఎఐటియుసి, రైతు సంఘం,ఐద్వా, యూటీఎఫ్, డి.హెచ్.పి.ఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఐయుటియుసి స్ట్రీట్వెండర్స్, కళాసీ కార్మిక సంఘం, ఎన్ఎసిఎల్, భవన నిర్మాణ కార్మిక సంఘం, మత్స్య కార్మిక సంఘం, బిఎస్ఎన్ఎల్ తదితర సంఘాల నాయుకులు పి.తేజేశ్వరరావు, ఏ.షణ్ముఖరావు, కే.మోహనరావు, కె.నాగమణి, ఏ. లక్ష్మి, ఎస్. కిషోర్ కుమార్, పి.ప్రభావతి కే.సూరయ్య ఎం.రమణ, వై.గోపాలుడు, యు.సూర్యనారాయణ సిహెచ్.రాము, ఎన్.తౌడు, పి.పోలారావు, సిహెచ్. సింహాచలం, ఎం.గోవర్ధనరావు, అల్లు.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️