కౌలు కార్డులు అందేనా?

నిధికౌలు రైతులకు
  • మొదలుకాని సిసిఆర్‌సి కార్డుల జారీ ప్రక్రియ

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న విత్తనాల పంపిణీ

ఎన్నికల ప్రక్రియతో దృష్టిసారించని అధికారులు

సకాలంలో కార్డులు అందడంపై నెలకొన్న సందేహాలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

కౌలు రైతులకు ఈ ఏడాదీ కష్టాలు తప్పేలా లేవు. కౌలు ఒప్పందాల కోసం భూ యజమానుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంట సాగు హక్కుదారుల పత్రాలు (సిసిఆర్‌సి) నోచుకోలేక గత సీజన్‌లో కౌలు రైతులు అనేక ఇబ్బందులు చవిచూశారు. విత్తనాల నుంచి ధాన్యం అమ్ముకోవడం వరకు అవస్థలు పడ్డారు. ఈ ఏడాదైనా కార్డులు అందుతాయని వారంతా ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండడంతో ప్రభుత్వం ఆ అంశంపై పెద్దగా దృష్టిసారించినట్లు కనిపించడం లేదు. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం కూడా కౌంటింగ్‌ ఏర్పాట్లపైనే ప్రధానంగా దృష్టిసారించడంతో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ కనీసం ప్రారంభం కాలేదు. సాధారణంగా మే నెలలోనే కౌలు రైతుల గుర్తింపు కోసం గ్రామసభలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇప్పటివరకు అటువంటి ప్రక్రియ చేపట్టకపోవడంతో, కార్డులు చేతికి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో అన్నిరకాల పంటలు కలిపి సుమారు 6.62 లక్షల ఎకరాల విస్తీర్ణం మేర సాధారణ సాగుగా ఉంది. అందులో ఈ ఏడాది 3.87 లక్షల ఎకరాల్లో వరి వేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇందులో సుమారు 1.50 లక్షల ఎకరాల పైన కౌలు రైతులే సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 1.20 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని ఒక అంచనాగా ఉంది. కౌలు గుర్తింపు లేక ఏటా వర్షాభావ పరిస్థితులు, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారు. బీమా పరిహారం, బ్యాంకుల నుంచి రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీలు తదితర ప్రయోజనాలు పొందుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం పంట సాగు హక్కుదారుల చట్టం-2019 ప్రకారం సాగు హక్కు పత్రాలను జారీ చేసేందుకు సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరించే పని ఇప్పుడు ప్రారంభించింది. గతేడాది 7,700 మందికి రైతులకు కార్డులు అందించారు.భూ యజమానులు ససేమిరాగ్రామసభలు నిర్వహించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసే ప్రక్రియ 2019 వరకు సాగింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పంట సాగు హక్కుదారుల చట్టం-2019ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతు గుర్తింపు కార్డు పొందాలంటే భూ యజమాని రాతపూర్వక అగ్రిమెంటు తీసుకోవాలి. అధికశాతం మంది భూ యజమానులు ససేమిరా అంటున్నారు. ఒకట్రెండు ఎకరాల భూమి ఉన్న వారు స్థానిక రైతులకు కౌలుకు ఇచ్చి చాలామంది వలస వెళ్లిపోతున్నారు. ఆధార్‌కార్డు, పాస్‌పుస్తకం కాపీలు ఇవ్వడానికి, రాతపూర్వక సమ్మతి తెలపడానికి వారు రావడానికి ఇష్టపడడం లేదు. భూ యజమానులు అంగీకరించకపోవడంతో వారి కోరిన కౌలు చెల్లించేలా ప్రయివేట్‌గా ఒప్పందాలు కుదుర్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. దీంతో భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా, పత్రాలకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రభుత్వమే హామీగా ఉండి పత్రాలు అందించేలా చూడాలని కౌలు రైతులు కోరుతున్నారు.కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆగాల్సిందేనా?సిసిఆర్‌సి కార్డులు పొందడానికి కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆగాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం అధికార యంత్రాంగం ఎన్నికల కౌంటింగ్‌ పైనే దృష్టిసారించింది. కార్డుల జారీకి మార్గదర్శకాలు, గ్రామసభల నిర్వహణ వంటి అంశాలపై ప్రభుత్వం ఒక సర్క్యులర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ అంశానికి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కార్డుల జారీ మొదలవుతుందని కూడా చెప్పలేం. దీంతో ఈ ఏడాది కౌలు గుర్తింపుకార్డులు సకాలంలో అందడంపై సందేహాలు నెలకొన్నాయి.

సిసిఆర్‌సి కార్డుల జారీలో నిర్లక్ష్యం

కౌలు రైతులకు సిసిఆర్‌సి కార్డుల జారీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన పంట సాగుదారుల చట్టం-2019తో కౌలు రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. అక్కడక్కడా కొద్దిమందికి కార్డులు ఇచ్చినా బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించి కార్డులు జారీ చేయాలి. భూ యజమానితో సంబంధం లేకుండా ప్రభుత్వం కౌలు రైతులకు సాగు హక్కు పత్రాలను అందించాలి.

– కె.మోహనరావు, జిల్లా కార్యదర్శి, ఎపి రైతుసంఘం

సాగు హక్కు పత్రాల జారీకి చర్యలు

కౌలు రైతులకు సాగు హక్కు పత్రాల జారీకి చర్యలు తీసుకుంటాం. రుణాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేస్తుంది. సిసిఆర్‌సి కార్డుల అందజేతకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది.

– కె.శ్రీధర్‌, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు

➡️