భానుడి భగభగ

ఏప్రిల్‌ మొదటి వారంలోనే భానుడి

బూర్జ : నిర్మానుష్యంగా ఉన్న పాలకొండ-శ్రీకాకుళం ప్రధాన రోడ్డు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌, కవిటి, బూర్జ

ఏప్రిల్‌ మొదటి వారంలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఉదయం 8 గంటల నుండే ఎండ తీవ్రత మొదలవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో గ్రామాలతో పాటు పట్టణాల్లోని వీధులు జనాలు లేక బోసిపోయాయి. మరోవైపు పింఛనుదారులకు వేడి సెగలు తప్పలేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, వేడి గాలులు వీస్తుండడంతో చాలామంది లబ్ధిదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఉపాధి హామీ కూలీలు, రైతులు, పశు పక్ష్యాదులు వేడుగాలుల తీవ్రతకు గురయ్యాయి. వెరసి ఏప్రిల్‌ మొదటి వారం నుంచే వేడి తీవ్రత పెరిగిపోవడంతో భవిష్యత్‌ ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలస మండలంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తహశీల్దార్‌ కార్యాలయం ఎఎస్‌ఐ బెండి నారాయణరావు తెలిపారు. ప్రస్తుతం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల ఆధారంగా జిల్లా ఆరెంజ్‌ జోన్లో ఉంది. మరింత పెరిగితే రెడ్‌ జోన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. జిల్లా కేంద్రానికి నిత్యం 50 వేల మంది వస్తూ… వెళ్తుంటారు. జిల్లా కేంద్రాల్లో ప్రధాన కూడళ్లలో చలువ పం దిళ్లు, చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ, బస్టాండ్‌, రద్దీ ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యాలు కానరావడం లేదు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను వైద్య, ఆరోగ్యశాఖ అందుబాటులో ఉంచాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

➡️