రాష్ట్రానికి బిజెపి తీరని ద్రోహం

ప్రత్యేక హోదా, విభజన హామీలు

సమావేశంలో మాట్లాడుతున్న పరమేశ్వరరావు

* ఎవరిని మోసం చేయడానికి టిడిపి, జనసేన పొత్తు

* మోడీకి తొత్తుగా జగన్‌

* ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలి

* ఫోరం నాయకుల విజ్ఞప్తి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని డిసిసి అధ్యక్షులు, శ్రీకాకుళం ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు డి.గోవిందరావు, చాపర వెంకటరమణ విమర్శించారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్‌ భవనలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తీరని అన్యాయం చేసిన బిజెపితో టిడిపి, జనసేన జత కట్టాయని, ఎవరిని మోసం చేయడానికి ఈ పొత్తు అని ప్రశ్నించారు. దేశ సంపదను అంబానీ, అదానీకి దోచిపెడుతూ ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకొస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందన్నారు. జిల్లాలో వంశధార, ఆఫ్‌షోర్‌, నారాయణపురం వంటి ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ పాలనలోనే సాధ్యమయ్యాయని తెలిపారు. టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, సాగునీటి కాలువ మరమ్మతులు, షట్టర్లు ఏర్పాటుకు నిధులు ఇవ్వకుండా రైతాంగానికి తీరని ద్రోహం చేశాయన్నారు. ఉద్దానం ప్రాంతంలో జీడి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని పోరాడుతున్నా పట్టించుకునే వారు లేరన్నారు. కొబ్బరి సాగు జిల్లాలో కళావిహీనంగా మారిందన్నారు. రైతాంగాన్ని టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలమయ్యాన్నారు. మరోవైపు ఉద్దానం నుంచి పెద్దఎత్తున ఇతర ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై నిర్లక్ష్యంగా వ్యహరించారన్నారు. కిడ్నీ పరిశోధనా కేంద్రమని నమ్మించిన వైసిపి ప్రభుత్వం, అక్కడ ఏం పరిశోధనలు చేస్తున్నారో చెప్పాలన్నారు. డయాలసిస్‌ కేంద్రాల్లో వైద్యులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 183 కిలోమీటర్ల పొడవు విస్తీర్ణం గల సముద్రతీర ప్రాంతంలో 204 పంచాయతీల్లో మత్స్యకారులు జీవిస్తున్నారని, వారి కోసం ఇంతవరకు కోల్డ్‌ స్టోరేజ్‌ను ఏర్పాటు చేయలేదన్నారు. కార్పొరేట్‌ వ్యాపార అవసరాల కోసం మూలపేటలో పోర్టు నిర్మిస్తున్నారని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా మత్స్యకారులు డిమాండ్‌ చేస్తున్న హార్బర్‌ను మాత్రం నిర్మించలేదన్నారు. సమస్యలు పరిష్కారం కావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు సనపల అన్నాజీరావు, అంబటి కృష్ణారావు, యువజన కాంగ్రెస్‌ నాయకులు రెల్ల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️