లెక్కలు పక్కాగా చూపాలి

మున్సిపాల్టీలో గత ఐదేళ్లలో నిధులకు సంబంధించిన లెక్కలన్నీ

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

మున్సిపల్‌ నిధుల గోల్‌మాల్‌పై ఆరా

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ప్రజాశక్తి – ఆమదాలవలస

మున్సిపాల్టీలో గత ఐదేళ్లలో నిధులకు సంబంధించిన లెక్కలన్నీ పక్కాగా ఉండాలని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ అధికారులు చూపించిన పలు గణాంకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పలు శాఖల్లో విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక ఒప్పంద ఉద్యోగులకు, రికార్డుల్లో చూపిన గణాంకాలకు వ్యత్యాసం ఉండడాన్ని ప్రశ్నించారు. రెండు రోజుల్లో శాఖల వారీగా నిర్వహించే సమీక్షా సమావేశం నాటికి సరైన గణాంకాలు చూపకపోతే సహించేది లేదని మున్సిపల్‌ అధికారులను హెచ్చరించారు. కొన్ని శాఖల సచివాలయ ఉద్యోగులను మున్సిపల్‌ ఒప్పంద ఉద్యోగుల స్థానంలో నియమిస్తే కొంతమేర ప్రభుత్వానికి ఆర్థికభారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. 2019 నాటికి అప్పటి మున్సిపల్‌ పాలకవర్గం రూ.2.60 కోట్ల రూపాయల ఆదాయం చూపితే 2019 నుంచి 2024 వరకు 60 శాతం పన్నులు పెంచినా ఆదాయం పెరగకపోవడంలో ఆంతర్యం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు తక్షణమే పేపర్‌ బిల్లు నిలుపుదల చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా సాక్షి పేపర్‌ కనిపిస్తే సహించేది లేదన్నారు. 2018 నాటికి మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డుల్లో 46 వేల జనాభా ఉంటే, గణాంకాల్లో మున్సిపల్‌ గ్రేడింగ్‌ కోసం 54 వేల జనాభా ఉన్నట్లు చూపడం ఎంతవరకు సమంజసమని అధికారులను ప్రశ్నించారు. మున్సిపల్‌ గ్రేడింగ్‌ పెరిగితే ఏమైనా ఆదాయం పెరుగుతుందా?, గ్రేడింగ్‌ వల్ల ప్రజల నెత్తిన అధిక పన్నుల భారం తప్ప సాధించే ప్రగతి ఏమైనా ఉందా అని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో 10, 213 గృహాలు ఉంటే వాటిని 13 వేలుగా చూపడం ఏమిటని, పెరిగిన మూడువేల ఇళ్లకు మున్సిపల్‌ అనుమతులు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఇస్తే, వాటి ఆదాయం ఎక్కడ అని నిలదీశారు. వైసిపి ప్రభుత్వంలో వసూలు చేసిన చెత్త పన్నుల సొమ్ము ఎక్కడికి వెళ్లాయని, వాటి పూర్తి వివరాలు చెప్పాలని ప్రశ్నించడంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు బిక్క మొహం వేశారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రాథమికంగా 23 వార్డులు ఉంటే రికార్డుల్లో 27 వార్డులు ఎందుకు నమోదు చేశారని ఇటువంటి గణాంకాలు చూపితే సహించేది లేదని హెచ్చరించారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాలకు అధికారులు ఇటువంటి తప్పుడు నివేదికలు రూపొందించడం ప్రజలను మోసగించడమేనన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డుల్లో నెలకొన్న రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, తాగునీటి వసతులు, శ్మశాన వాటికలు, పాఠశాలల పరిస్థితులపై పక్కా నివేదికలు తనకు అందించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మార్కెట్‌, చింతాడ వారపు సంత ఆశీలు వేలంపాటను తక్షణమే నిర్వహించి మున్సిపల్‌ ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జి.రవి, మేనేజర్‌ బిషారు, ఎఇ బి.అప్పలనాయుడు, టిపిఒ హెచ్‌.సత్యనారాయణ, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

➡️