ఎన్నికల విధులకు ధ్రువపత్రాలు మంజూరు చేయాలి

ఎన్నికల విధులు నిర్వహించిన

వినతిపత్రం అందజేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులందరికీ డ్యూటీ ధ్రువపత్రాలు మంజూరు చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన కలెక్టర్‌ను సంఘం తరుపున అభినందనలు తెలిపారు. అనంతరం ఎన్నికల సమస్యలను వివరించారు. ఎన్నికల విధులులో భాగంగా రిసీవింగ్‌ సెంటర్లలో ఈ నెల 14న ఉదయం వరకు విధులు నిర్వర్తించిన పిఒ, ఎపిఒ, ఒపిపిఒలకు రెమ్యూనరేషన్‌ చెల్లించాలన్నారు. అలాగే హోమ్‌ ఓటింగ్‌ విధులు నిర్వహించిన వారికి ట్రైనింగ్‌ నిమిత్తం రెమ్యూనరేషన్‌ చెల్లించాలని కోరారు. రిజర్వు విధుల్లో ఉన్న వారిలో కొంతమందికి రెమ్యూనరేషన్‌ చెల్లింపుల్లో వ్యత్యాసాన్ని సరి చేయాలని వివరించారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ… ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఎన్నికల విధుల ధ్రువపత్రాలను వెంటనే అందజేస్తామని అన్నారు. ఎన్నికల బడ్జెట్‌ను సరిచూసి అవకాశమున్న ప్రాప్తికి 14న కూడా రెమ్యూనరేషన్‌ మంజూరుకు పరిశీలిస్తామని చెప్పారు. మిగిలిన సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, జిల్లా కోశాధికారి బి.రవికుమార్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ పి.అప్పారావు, జిల్లా నాయకులు ఎల్‌.కోదండరామయ్య పాల్గొన్నారు.

 

 

➡️