మంత్రులకు అఖండ స్వాగతం

కేంద్ర, రాష్ట్ర

గజమాలతో సత్కరిస్తున్న టిడిపి నాయకులు

  • పైడిభీమవరం నుంచి శ్రీకాకుళం వరకు కోలాహలంగా ర్యాలీ
  • పెద్దఎత్తున తరలివచ్చిన కూటమి నాయకులు, అభిమానులు
  • పలుచోట్ల గజమాలలు, బాణసంచా కాల్చిన శ్రేణులు
  • శ్రీకాకుళం నగరంలో పౌర సన్మానం

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి జిల్లాకు సోమవారం వచ్చిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుకు టిడిపి శ్రేణులు, అభిమానులు అఖండ స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు పైడిభీమవరం నుంచి స్వగ్రామం కోటబొమ్మాళి మండలంఓని నిమ్మాడ వరకు వందలాది వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. పలుచోట్ల గజమాలలు వేసి తమ నేతలపై అభిమానం చాటుకున్నారు. పలు కూడళ్లలో పూల వర్షం కురిపించారు. బాణసంచా కాల్చి ఆనందంతో నృత్యాలు చేశారు. తప్పెటగుళ్లు, ఇతర రూపాల్లో కోలాహలంగా ర్యాలీ సాగింది. ఓపెన్‌ టాప్‌ జీప్‌లో ఇరువురు మంత్రులతో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు.. కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం శ్రీకాకుళం నగరంలో ఇద్దరు మంత్రులకూ పౌర సన్మానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్ధేశించి కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ ఎంపీగా ఉంటూ 2014 నుంచి ఇప్పటివరకు జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉండటంతో అన్ని శాఖల కేంద్రమంత్రులతో మాట్లాడి రాష్ట్రం, జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొస్తానని చెప్పారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మూడు జిల్లాలకు అభివృద్ధి కేంద్రంగా మారుస్తాని మాట ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా టీమ్‌తో కలిసి జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం చాలా రాక్షసంగా వ్యవహరించిందని, తప్పులు చేసే వారిని ఎవరూ కాపాడలేరన్నారు. కక్షపూరిత రాజకీయాల కంటే అభివృద్ధి పైనే ప్రధానంగా దృష్టిసారిస్తామన్నారు.రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ పరిపాలన ఎలా సాగిందో చూశామని.. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడ్డామని చెప్పారు. రాష్ట్రంలో తాను, వైసిపి తప్ప ఎవరూ ఉండకూడదనట్లుగా జగన్మోహన్‌రెడ్డి వ్యవహరించారని విమర్శించారు. ఎప్పుడూ ఇన్ని బాధలు పడలేదని, పార్టీ ఉంటుందా అనే సందేహం కూడా వచ్చిందన్నారు. మనది డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అని కేంద్రం, మోడీ సహకారంతో అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. వెనుకబడిన జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం ప్రాంతానికి 90 శాతం సబ్సిడీలు, ఉద్యాన పంటలు, పశుసంపద అభివృద్ధికి అవరమైన చర్యలు చేపడతానని హామీనిచ్చారు. జిల్లాకు కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రతి మండలంలో 400 ఎకరాలను సేకరించి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఉన్న పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను రెండు, మూడేళ్లలో పూర్తి చేసి సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. మత్యకారులకు జెట్టీలతో పాటు కోల్డ్‌ స్టోరేజీలను నిర్మించి వలసలు లేకుండా చూస్తామన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తామని చెప్పారు. కోడి రామ్మూర్తి స్టేడియం పూర్తి చేస్తామన్నారు. మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం పనిచేసినా శ్రీకాకుళం, ఆమదాలవలస రోడ్డును పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఈ రోడ్డు పనులు ఈనెల 19న ఉదయం పది గంటల కల్లా కాంట్రాక్టర్‌ మొదలుపెడతారని చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ కూటమికి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చారు.రామ్మోహన్‌ నాయుడు అనే నేను..ఢిల్లీలో ఎంపీగా తాను చేసిన ప్రమాణ స్వీకారం సగమేనని, జిల్లా ప్రజల ముందు చేస్తేనే పరిపూర్ణమవుతుందంటూ కేంద్ర మంత్రి… రామ్మోహన్‌నాయుడు అనే నేను అంటూ ప్రారంభించి మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, ఎన్‌.ఈశ్వరరావు, మామిడి గోవిందరావు, టిడిపి జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️