నారాయణపురం ఆధునికీకరణ పనులకు గ్రహణొం

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని

నారాయణపురం ఆనకట్ట

అర్ధాంతరంగా నిలిచిన పనులు

పట్టించుకోని ప్రభుత్వాలు

ఆందోళనలో రైతులు

నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులకు గ్రహణం పట్టింది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పనులు పూర్తవుతాయని, తమకు పుష్కలంగా సాగునీరు అందుతుందని కలలుగన్న రైతన్నలకు నిరాశే ఎదురవుతుంది.

ప్రజాశక్తి- బూర్జ

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2017లో ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జపాన్‌ ప్రభుత్వం రూ.112 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో తెలుగుదేశం ప్రభుత్వం ఆనకట్టుకు సంబంధించి కొత్త సెంట్రల్‌ వేసేందుకు సైడ్‌వాల్స్‌ నిర్మించేందుకు, అలాగే కుడి, ఎడమ కాలువలను 50 కిలోమీటర్ల వరకు పనులను ప్రారంభించింది. ఈ ఆధునికరణ పనులు పూర్తయితే నాగావళి నది నుంచి నారాయణపురం ఆనకట్ట ద్వారా కుడి, ఎడమ కాలువల వలన జిల్లాలోని ఏడు మండలాలకు, 67 గ్రామాలకు సుమారు 37 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులను ప్రారంభించింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బూర్జ, ఎచ్చెర్ల తదితర మండలాల్లో ఆధునికీకరణ పనులు 40 శాతం వరకు పూర్తయ్యాయని అనంతరం వాటిని అర్థాంతరంగా విడిచి పెట్టారని ఆయా మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం వైసిపి ప్రభుత్వ హాయంలో ఆధునికీకరణ పనులు పూర్తవుతాయని, తమ సాగునీటి కష్టాలు తీరుతాయని ఎదురు చూసిన రైతులకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ప్రతి ఏడాది పనులు పూర్తి చేస్తామని హామీలు గుప్పించిన ప్రభుత్వం చిట్టచివరకు వాటిని అలాగే వదిలేయడంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదని రైతులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అర్థాంతరంగా నిలిచిన ఆధునీకరణ పనులను చేపట్టి పుష్కలంగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

 

➡️