లెనిన్‌ స్ఫూర్తితో సమరశీల పోరాటాలు

పోరాట యోధుడు లెనిన్‌

లెనిన్‌ చిత్రపటానికి నివాళ్లర్పిస్తున్న సిపిఎం నాయకులు

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

పోరాట యోధుడు లెనిన్‌ స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అధ్యక్షతన నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో లెనిన్‌ జయంతి సభను సోమవారం నిర్వహించారు. లెనిన్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలి సోషలిస్టు విప్లవాన్ని సాధించిన మహా విప్లవ నేత కామ్రేడ్‌ లెనిన్‌ అని కొనియాడారు. శ్రామికవర్గ విప్లవ నేత, 20వ శతాబ్దపు గొప్ప మార్క్సిస్టు మేధావి, ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రామికవర్గ రాజ్యం సోవియట్‌ యూనియన్‌ను సాధించిన ఘనత లెనిన్‌ నాయకత్వానికి దక్కుతుందన్నారు. కష్టపడి సంపద సృష్టించే వర్గాలు రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, వృత్తిదారులు తదితరులకు సంపదపై అధికారం ఉండాలని, అలాంటి వారికే రాజ్యాధికారం కావాలని పోరాడారని గుర్తుచేశారు. అసమానతల్లేని సోషలిస్టు సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని తెలిపారు. అమానుషమైన పెట్టుబడిదారీ దోపిడీకి విరుగుడు సోషలిజమేనని ఆయన ఆచరణలో రుజువు చేశారని చెప్పారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని లెనిన్‌ గట్టిగా బలపరిచారని తెలిపారు. సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా సాగుతున్న నాటి సామాజిక ఉద్యమాలను ఆయన ప్రత్యేకంగా గమనంలోకి తీసుకున్నారన్నారు. లెనిన్‌ సిద్ధాంతం యువత బంగారు భవిష్యత్‌కు, భారతదేశ అభ్యున్నతికి మార్గదర్శకం అవుతుందన్నారు. లెనిన్‌ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభలో సిపిఎం నాయకులు బి.కృష్ణమూర్తి, కె.మోహనరావు, వి.జి.కె మూర్తి, కె.శ్రీనివాసు, పి.తేజేశ్వరరావు, ఎ.లక్ష్మి, ఎం.గోవర్థనరావు తదితరులు పాల్గొన్నారు

.

➡️