కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

జూన్‌ 4న ఎచ్చెర్ల మండలం

స్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి- శ్రీకాకుళం

జూన్‌ 4న ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని శివాని ఇంజినీర్‌ కళాశాల స్ట్రాంగ్‌ రూమ్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియకు పటిష్ట భద్రత ఏర్పాట్లు ఉండాలని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక పోలీసు అధికారుల ను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఓట్లు కౌంటింగ్‌ నిర్వహణ, కౌంటింగ్‌ రోజున తీసుకోవలసిన చర్యలు, భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై డిఎస్‌పిలు, సిఐలతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓట్లు కౌంటింగ్‌ నిర్వహించే శివాని ఇంజినీరింగ్‌ కళాశాలల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు, జిల్లా ఆర్మ్డ్‌ రిజర్వ్‌, సివిల్‌ పోలీసులతో మూడంచెల బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, చేపట్టాల్సిన భద్రత చర్యలపై దిశానిర్ధేశం చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ట్రాఫిక్‌ రెగ్యులేషన్‌, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 144 సెక్షన్‌ ప్రకారం కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా చూడాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలకు విచ్చేసే వివిధ పార్టీలకు చెందిన కౌంటింగ్‌ ఏజంట్లు, వాహనాలను కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా నిర్ధేశించిన పార్కింగ్‌ ప్రాంతాలకు తరలించాలన్నారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని, కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాలలోకి వెళ్లే ఏజంట్లను కుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. రిటర్నింగ్‌ అధికారి జారీ చేసిన అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. రిటర్నింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు మినహా మిగిలిన వారి మొబైల్స్‌ను కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించ వద్దన్నారు. ఫలితాలు వెల్లడైన తరువాత జిల్లాలో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పెట్రోలింగ్‌ నిర్వహించాలని, ముందుగా గుర్తించిన ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసి నిఘా పెట్టాలని ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన ట్రబుల్‌ మాంగర్స్‌లకు నోటీసులు ఇవ్వాలన్నారు. విజయ ర్యాలీలు, బాణసంచ పేలులకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. శాంతియుతంగా ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయ్యేలాగా అధికారులు సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్‌పిలు జి.ప్రేమ్‌కాజల్‌, వి.ఉమమహేశ్వరరావు, డిఎస్‌పిలు బాలచంద్రారెడ్డి, శృతి, త్రినాథరావు, నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, విజయ కుమార్‌, సిఐలు తదితరులు పాల్గొన్నారు.

➡️