ఓటు హక్కు వజ్రాయుధం

ప్రజాస్వామ్య భారతదేశంలో

మాట్లాడుతున్న బిఆర్‌ఎయు విసి రజని

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు హక్కు వజ్రాయుధమని, దాన్ని వినియోగించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ కె.ఆర్‌ రజని అన్నారు. ‘ఓటు విద్య – ఎన్నికల వ్యవస్థలో భాగస్వామ్యం’ అనే అంశంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సిబిసి), వర్శిటీ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం సంయుక్తంగా వర్శిటీ హాల్‌లో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేధావులు, విద్యావంతులు, విద్యాధికులు దేశంలో ఓటింగ్‌ శాతం పెరిగేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సిబిసి) అదనపు డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ భారత్‌లోనే జరుగుతోందన్నారు. అందులో పాల్గొనే అవకాశాన్ని జారవిడుచుకోవద్దని కోరారు. 18-29 ఏళ్ల మధ్యలో 30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారంతా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. యువత నిరాశ వీడి దేశ భవిష్యత్‌ కోసం ఓటు వినియోగానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సభాధ్యక్షులు, జిల్లా క్షేత్ర ప్రచార అధికారి బబి.తారక ప్రసాద్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం భారీగా పెంచేందుకు ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు.అంతకుముందు ఓటు హక్కు సద్వినియోగంపై వర్శిటీలో ర్యాలీ నిర్వహించారు. ఓటు విద్య- ఎన్నికల వ్యవస్థలో భాగస్వామ్యంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు కళాశాలల వారీగా బహుమతులు ప్రదానం చేశారు. ఓటు హక్కు అవశ్యకతపై ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు వినియోగంపై పొందూరు మండలం గోకర్ణపల్లికి చెందిన శ్రీ చక్రపాణి కళా బృందం సభ్యులు ప్రదర్శించిన జానపద గేయాలు, నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వర్శిటీ రెక్టార్‌ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్‌ పి.సుజాత, జర్నలిజం విభాగం అధ్యాపకులు ఆర్‌.తిరుపతిరావు, జి.లీలావరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️