కంట్రోల్‌రూమ్‌లో నిఘా

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌

ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌

కలెక్టర్‌ నిరంతర పర్యవేక్షణ

ప్రజాశక్తి- శ్రీకాకుళం

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంను పోలింగ్‌ రోజు పర్యవేక్షణ కోసం 600 మంది సిబ్బందితో ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెల్‌ నుంచి వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఓటింగ్‌ సరళిని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ పర్యవేక్షించారు. ఉదయం 5 గంటలకే కంట్రోల్‌ రూంకు చేరుకున్న ఆయన వెంటనే ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌ జరుగుతున్న తీరును గమనించారు. ఒకటి, రెండు చోట్ల ఇవిఎంల్లో సాంకేతిక లోపాలను తెలుసుకుని 15 నిమిషాల్లోనే కొత్త వాటిని అక్కడ ఏర్పాటు చేయించారు. పోలింగ్‌ ఉదయం ఏడు గంటలకే ప్రారంభం అయ్యేలా, ఎక్కడా ఐదు నిమిషాలు కూడా ఆలస్యం అవ్వకూడదని ఆయన చేసిన ప్రయత్నం సత్ఫలిచ్చింది. రోజంతా ఎక్కడా ఇవిఎంల్లో సాంకేతిక లోపం అనే పదమే లేకుండా పకడ్బందీగా ఎన్నికల నిర్వహించడంలో ఆయన మార్క్‌ స్పష్టంగా కనిపించింది.పోల్‌ డే మానిటరింగ్‌ సిస్టం (పోలింగ్‌ రోజున నిర్వహించాల్సిన పనులు) కోసం ఆయన ముందుగా ఏర్పాటు చేసిన నోడల్‌ అధికారులంతా వారి వారి విధుల్లో క్రియాశీలకంగా పని చేస్తుండటంతో ఎక్కడ లోటుపాట్లు జరిగినా, చిన్న పాటి పొరపాట్లు తలెత్తినా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కి సమాచారం ఇట్టే చేరిపోయేది. చివరకు చెదురు, మదురు ఘటనలను సైతం ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. సెక్టార్‌ అధికారులను, పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ కనిపించారు. పొందూరు మండలంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ విషయాన్ని అధికారుల కంటే ముందే ఆయనే నేరుగా సమాచారం తెప్పించుకుని సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేసేలా చేసింది. వెబ్‌ క్యాస్టింగ్‌లో పోలింగ్‌ కేంద్రంలో ఎవరైనా సెల్‌ఫోన్‌తో ప్రవేశించినా, అనుమానాస్పదంగా కనిపించినా, క్యూలైన్ల నిర్వహణ సరిగ్గా లేకపోయినా, స్క్రీన్‌ మీద చూసిన వెంటనే పోలింగ్‌ స్టేషన్‌ నెంబర్‌ నమోదు చేసుకుని నేరుగా ఆర్‌ఒలతో మాట్లాడుతూ సూచనలిస్తూ అప్రమత్తం చేస్తూ కనిపించారు. క్యూలైన్ల నిర్వహణ సైతం పోలింగ్‌ స్టేషన్ల వారీగా పరిశీలిస్తూ ఎక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా చొరవ తీసుకోగలిగారు. సోషల్‌మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వస్తున్న వార్తల వివరాలను, స్క్రోలింగ్‌లను గుర్తించి ఎంసిఎంసిలు కమిటీలను అప్రమత్తం చేశారు. కంట్రోల్‌ రూమ్‌ వెలుపల ఏర్పాటు చేసిన పోలింగ్‌ శాతాన్ని, ఇతర సమాచారం తెలుసుకునే సిబ్బంది దగ్గరకి ప్రతి అరగంటకు తానే స్వయంగా బయటకు వెళ్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఓటర్‌ హెల్ప్‌లైన్‌ కోసం నిర్దేశించిన 1950కి వస్తున్న ఫిర్యాదులను ప్రతి గంటకూ నివేదిక రూపంలో తెప్పించుకుని 100 శాతం ఓటరుకు సహాయపడేలా సూచనలు జారీ చేశారు. సెక్టార్‌ అధికారుల వాహనాలు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నది జిపిఎస్‌ ద్వారా తెలుసుకొని, సమయానుకూలంగా సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్ల వైపు వాటిని పంపిస్తూ పదేపదే ఫోన్‌లో క్షణం తీరిక లేకుండా మాట్లాడుతూ కనిపించారు. ఎన్నికలను ప్రశాంతంగా ముగించడంలో జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ సఫలమయ్యారు.

 

➡️