రానున్న రెండు వారాలు కీలకం

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు

మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి

  • ఎన్నికల పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రానున్న రెండు వారాలు అత్యంత కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌, ఎస్‌పి జి.ఆర్‌ రాధికతో కలిసి ముగ్గురు ఎన్నికల పరిశీలకులు, మరో ఇద్దరు పరిశీలకులు ఎన్నికల నోడల్‌ అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అధికారి ఎన్నికల నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్‌ శాతం పెరిగేలా, ఓటరు నిర్భయంగా వచ్చి ఓటు వేసేలా కృషి చేయాలని సూచించారు. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో జాగ్రత్త వహించాలన్నారు. ఒడిశా నుంచి మద్యం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగిన వారిని నియంత్రించాలని, ఇప్పటికే అలాంటి వారి జాబితాను ఆయా ఆర్‌ఒలకు పంపించినట్లు తెలిపారు.ఓటింగ్‌ శాతం పెంచేందుకు కృషిప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. సాధారణ పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి, సందీప్‌ కుమార్‌, పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా, పోలీసు పరిశీలకులు సచింద్ర పటేల్‌, దిగంబర్‌ పి.ప్రదాన్‌కు ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఇప్పటికే సిబ్బందికి రెండు విడతల శిక్షణ పూర్తి చేశామని, మొదటి విడత ఇవిఎంల ర్యాండమైజేషన్‌ పూర్తయిందని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు, గిరిజన ప్రాంతంలో పోలింగ్‌ కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్ల గురించి తెలిపారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకు కషి చేస్తున్నామని, రిసెప్షన్‌ సెంటర్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పోలింగ్‌ రోజున 569 వాహనాలు సమకూర్చినట్లు వివరించారు.520 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుజిల్లాలో పోలీసు బందోబస్తు, నిఘా బృందాలు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఎస్‌పి రాధిక వివరించారు. ఇప్పటివరకు రూ.4.32 కోట్ల విలువైన మద్యం, బంగారం, గంజాయి వంటివి సీజ్‌ చేశామన్నారు. 520 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. ఎన్నికల పరిశీలకులు సందీప్‌, పర్వేజ్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ ఓటర్ల స్లిప్పులను పూర్తి వివరాలతో శతశాతం పంపిణీ చేయడం ద్వారా, పోలింగ్‌ శాతం పెరుగుతుందని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక ప్రచార కార్యక్రమాలు పెరుగుతాయని, అందువల్ల కోడ్‌ ఉల్లంఘనలపై దృష్టిసారించాలని సూచించారు. హోం ఓటింగ్‌లో ఓటరు రహస్యంగా ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలన్నారు. కంపార్ట్‌మెంట్‌లో ఓటు వేస్తున్నప్పుడు వీడియో రికార్డింగ్‌ చేయకూడదని స్పష్టం చేశారు. పోలీసు పరిశీలకులు సచింద్ర పటేల్‌ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పోలింగ్‌ పర్సనల్స్‌ సెకండ్‌ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం నవీన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఎఎస్‌పి ప్రేమ కాజల్‌, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, ఆర్‌ఒలు నూరుల్‌ కమర్‌, భరత్‌ నాయక్‌, సిహెచ్‌.రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్‌, సుదర్శన్‌ దొర, అప్పారావు, ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, సిపిఒ ప్రసన్నలక్ష్మి, జిల్లా ఆడిట్‌ అధికారి సుల్తానా, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️