మతోన్మాదాన్ని ఓడించడమే కానూరికి అందించే నివాళి

Apr 11,2024 11:44 #srikakulam

ప్రజాశక్తి-శ్రీకాకుళం రూరల్ : మతోన్మాద ఫాసిజానికి బీజమేర్పిడిన తొలినాటి వైనాన్ని తన పాట మాట ఆటతో ఎండగట్టిన క్రాంతి దర్శి కానూరి వెంకటేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగానే ఫాసిస్టు ఆరెస్సెస్ బీజేపీ మతోన్మాదాన్ని ఓడించడమే నిజమైన నివాళి అవుతుందని సి.పి.ఐ (యం.యల్) న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటి కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. విప్లవోద్యమ నిబద్ధుడు అరుణోదయ సాంస్కృతికోద్యమ సారధి కానూరి వెంకటేశ్వరరావు 9వ వర్థంతి సందర్భంగా. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య శ్రీకాకుళం జిల్లా కమిటి ఈరోజు పెద్దపాడు తంగివానిపేటలో నిర్వహించిన ర్యాలీ, సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విప్లవ సాంస్కృతిక రంగంలో 70 ఏళ్ళకు పైగా నిర్విరామంగా కృషి సల్పి, తన 99వ ఏట 2015, ఏప్రిల్‌ 10తెదీన భౌతికంగా కాలం చేసిన నిబద్ధ విప్లవ కళాకారుడు, నేటి తరం తాతగా పిలుచుకునే కానూరి వెంకటేశ్వరరావు 1916లో కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా కోడూరు గ్రామంలో జన్మించారనీ చిన్ననాటి నుంచీ పాట, పద్యం నటనల పట్ల ఆసక్తిని పెంచుకున్నారన్నారు. కళ కళకోసం కాదనీ, కళ ప్రజల కోసమని నమ్మడంతో పాటు జీవితాంతం దాన్నే ఆచరించి చూపాడని తాండ్ర అన్నారు. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో, ఆ తర్వాత వెల్లువలా ముందుకు వచ్చిన నగ్జల్బరీ, శ్రీకాకుళ, గోదావరిలోయ ప్రతిఘటనా పోరాటాల్లో సాంస్కృతిక సైనికుడిగా నిలిచారన్నారు. తంబురాను ఆయుధంగా చేసుకుని అనేక బుర్రకథలతో పాలకుల మోసాలపై కానూరి నిప్పులు చెరిగారనీ భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం సాగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలోనే కానూరి వెంకటేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడయ్యారన్నారు. కానూరి సాంస్కృతిక ప్రస్థానం తన వందేళ్ళ జీవితం (99 ఏళ్ళు జీవించారు ) వరకూ అప్రతిహతంగా కొనసాగిందన్నారు. 70వ దశకంలో ఉస్మానియా యూనివర్శిటీని తన కళారంగానికి కేంద్రం చేసుకుని కానూరి సాగించిన రచనలు, కళారూపాలు దోపిడీ పాలకులపై తూటాల్లా పేలాయనీ ఆనాటి విద్యార్థి నాయకులైన జంపాల ప్రసాద్‌ తదితరులతో కలిసి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు కానూరి పునాదులేసారని తెలిపారు. క్రూర ఎమర్జెన్సీ ఫాసిస్టు పాలన నుండి ఇంద్రవెల్లి కాల్పుల దాకా పాలకుల చేసే ఏ దుర్మార్గాన్నీ, హత్యాకాండనూ వదలకుండా, వాటిపై అనేక పాటలూ, బుర్రకథలూ రాసి ప్రజానీకాన్ని చైతన్యపరిచారన్నారు. ‘‘రాముడో దేవుడో నీకిదేమి కర్మరో రాజకీయ రొంపిలోకి నిన్నే దించారురో….’’ అంటూ తన కళా ప్రదర్శనలతో మతోన్మాదాన్ని చీల్చి చండాడిన విప్లవ సాంస్కృతిక యోధుని విప్లవ ఆకాంక్షలు నెరవేర్చడమే నిజమైన నివాళి అవుతుందన్నారు. ప్రజా కళలపట్ల కానూరి కనపరిచిన అంకితభావాన్నీ విప్లవోద్యమ నిబద్ధతనూ క్రమశిక్షణనూ నేటి తరం అందిపుచ్చుకోవాల్సిన ఉత్తమ విలువలు వారి ఆశయాన్ని సాధించే దిశగా కృషి సాగించటమే నేటి తరం కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు సవలాపురపు కృష్ణవేణి, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కన్వీనర్ సార జగన్, అరుణోదయ జిల్లా నాయకులు బాలు, ప్రగతిశీల దళిత వేదిక నాయకులు డి. అప్పారావు, దివ్వాల అప్పారావు, పోలాకి రాజు, ఇద్దమాని చిన్నా, సవలాపురపు అప్పలరాజు, ఎచేర్ల్ వీరస్వామి, సవలాపురపు మురళి, సవలాపురపు గన్నేరాజు, కురామన అప్పమ్మ, సిమ్మమ్మ బద్రమ్మ, మణెమ్మ, దివ్వాలా చంటి, దివ్వాలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️