టోల్‌ నంబరు.. హలో 1950

ఎన్నికలకు సంబంధించి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికలకు సంబంధించి ఏ అంశంపైనైనా సందేహాలు నివృత్తి చేసుకునేందుకు, ఫిర్యాదులు చేయడానికి కలెక్టరేట్‌లో టోల్‌ ఫ్రీ నంబరు 1950ను ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఓటరు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈ నంబరుకు ఫోన్‌ చేస్తే చాలు సమాధానం ఇచ్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉంటారు. అయితే టోల్‌ ఫ్రీ నంబరు 1950నే ఎన్నికల సంఘం ఎందుకు ఎంచుకుందన్న అనుమానం రావచ్చు. మన దేశంలో 1950 జనవరి 25న స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ ఏర్పాటైంది. ఇది ఎన్నికలకు సంబంధించినంత వరకు స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతిసారీ సాధారణ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది ఉద్యోగుల సేవలను వినియోగించుకుం టుంది. దేశంలో మొదటిసారి సాధారణ ఎన్నికలను హిమాచల్‌ ప్రదేశ్‌లోని ‘చిని’లో నిర్వహించారు. ఆ సంవత్సరాన్నే టోల్‌ఫ్రీ నంబరుగా 1950ను ఎన్నికల సంఘం ఉచిత సహాయ, ఫిర్యాదుల కోసం కేటాయిస్తోంది. ఈ సహాయ కేంద్రం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు చేసేందుకు ప్రతి పౌరునికి హక్కు ఉంది. అలా అని అనవసర ఫిర్యాదులు చేయడం బాధ్యతారాహిత్యమవుతుంది. ఎన్నికల సమయంలో అధికారులు, ఉద్యోగులు నిబంధనలు పాటించకున్నా, అధికారులు ఎవరైనా రాజకీయ పార్టీలతో అంటకాగినా, వారు ఇచ్చే విందు, వినోదాల్లో పాల్గొన్నా ఫిర్యాదులు చేయొచ్చు. కొంతమంది అధికారులు దూర ప్రాంతాల నుంచి ఎన్నికల విధులకు వస్తుంటారు. పార్టీల నాయకులు వారికి వసతి, భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. అటువంటి వారిపైనా ఈ నంబరుకు ఫిర్యాదు చేయొచ్చు.

➡️