మినహాయింపు గ్రామాల్లో పత్తి సాగు ప్రారంభం

Jun 17,2024 00:26

వడ్డమానులో పత్తి విత్తనాలు నాటుతున్న కూలీలు
ప్రజాశక్తి – తుళ్లూరు :
రాజధాని నిర్మాణం నుంచి మినహాయించిన గ్రామాల్లో పత్తి సాగు ప్రక్రియ ప్రారంభమైంది. వర్షాల నేపథ్యంలో పత్తి విత్తనాలు నాటుతున్నారు. మండల పరిధిలో 21 గ్రామాలుండగా (రెండు శివారు గ్రామాలను కలిపి) వడ్డమాను, పెదపరిమి, హరిశ్చంద్రపురం గ్రామాలను రాజధాని నిర్మాణం నుంచి మినహాయించారు. మూడు గ్రామాలతో పాటు ల్యాండ్‌ పూలింగ్‌లో రాజధాని నిర్మాణానికి భూములివ్వని మెట్ట, లంక ప్రాంతాల్లో పంటల సాగు యథావిధిగా సాగుతోంది. వడ్డమానులో సుమారు రెండు వేల ఎకరాలు, హరిశ్చంద్రపురంలో రెండు వేలు, పెదపరిమిలో 6 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. వడ్డమాను, పెదపరిమిలో మినుము, పత్తి, మిర్చి తదితర పంటలు సాగవుతాయి. 10 వేల ఎకరాల్లో అత్యధికంగా 5 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా మిగిలిన ఎకరాల్లో మిర్చి, కంది, మినుము, కూరగాయలు పండిస్తారు. కృష్ణానదీ తీర ప్రాంత గ్రామమైన హరిశ్చంద్రపురంలో వరి, అరటి, కంద, పసుపు లాంటి ఉద్యాన పంటలూ పండుతాయి. మే నెలాఖరు నుంచే రైతులు సాగుకు సమాయత్తమయ్యారు. పొలాల్లో పత్తి కట్టెను మిషన్లతో తొలగించి దహనం చేయడం, పొలాలను శుభ్రం చేయడం, దుక్కులు, విత్తనాలు కొనుగోలు తదితర పనులు పూర్తి చేసి పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో పత్తి విత్తనాలు నాటుతున్నారు. సరిపడా వర్షాలు కురిస్తే విత్తనాలు నాటడంతోపాటు ఇతర పనులూ మరింత ముమ్మరం అవుతాయని రైతులు చెబుతున్నారు.

➡️