సగం వేతనం చెల్లింపుపై ఉక్కు కార్మికుల నిరసన

స్టీల్‌ప్లాంట్‌

సిఎండి, డైరెక్టర్లను కలిసి వ్యతిరేకత వ్యక్తం చేసిన అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు

కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకోబోమని యాజమాన్యానికి హెచ్చరిక

ప్రజాశక్తి -ఉక్కునగరం : ఉక్కు కార్మికులకు వేతనాలతోపాటు ఇతర రాయితీలు, ప్రయోజనాల చెల్లింపులో యాజమాన్యం అనుసరిస్తున్న అనుచిత, నిర్లక్ష్య వైఖరిని స్టీల్‌ప్లాంట్‌ అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు.సగం వేతనం చెల్లించి చేతులు దులుపుకున్న యాజమాన్యం దుర్మార్గపు వైఖరిని నిరసిస్తూ ఉక్కు డెడికేషన్‌ పార్కులో వేలాది మంది కార్మికులు ఆందోళన చేపట్టారు. 21 రోజులు తర్వాత కార్మికులకు సగం వేతనాలు చెల్లించిన ఉక్కు అధికారుల తీరుపై మండిపడ్డారు. అనంతరం ఒక్కో యూనియన్‌ నుండి ఒక్కొక్కరు చొప్పున అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు సిఎండిని, డైరెక్టర్లను కలిసి కార్మికుల వ్యతిరేకతను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గతంలో స్టీల్‌ప్లాంట్‌ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కార్మికుల వేతనాలను, వారికి చెల్లించాల్సిన రాయితీలు, ఇతర ప్రయోజనాలను విస్మరించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఉత్పత్తిపై దృష్టి సారించాలంటే కార్మికుల ప్రయోజనాలను దెబ్బ తీయకూడదన్న సత్యాన్ని ప్రస్తుత యాజమాన్యం గ్రహించాలని నిలదీసి ప్రశ్నించారు.డార్స్‌ స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన బార్స్‌(బయోమెట్రిక్‌) వల్ల వస్తున్న ఇబ్బందులు, మెడికల్‌ పర్మిషన్‌, బ్యాంకు పర్మిషన్‌ వంటి అంశాలపై సిఎండి దృష్టికి తీసుకెళ్లి, దీనిపై అన్ని విభాగాల వర్క్స్‌ హెచ్‌ఒడిలకు నిర్ధిష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన మిగతా సగం వేతనాన్ని ఈ రోజే చెల్లించాలంటూ పట్టుబట్టారు. దీనిపై సిఎండి అతుల్‌భట్‌ స్పందిస్తూ, కార్మికులకు మిగతా సగం వేతనాన్ని గురువారం సాయంత్రంలోగా వేస్తామని భరోసానిచ్చారు. మెడికల్‌ పర్మిషన్‌ వెంటనే అమల్లోకి వస్తుందని, బ్యాంకు, ఇతర పర్మిషన్ల విధివిధానాలపై జూన్‌ ఒకటో తేదీనాటికి సర్కులర్‌ జారీ చేస్తామన్నారు. బయోమెట్రిక్‌ హాజరుకు సహకరించిన కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో స్టీల్‌ప్లాంట్‌లో ఉత్పత్తి, ఇతర అంశాల్లో అందరం సమగ్ర విధానాలతో, సమిష్టిగా ముందుకు వెళితేనే విజయం సాధ్యమని సిఎండి పునరుద్ఘాటించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసిన సిఎండి, మున్ముందు పూర్తిస్థాయి ఉక్కు ఉత్పత్తితో దీన్ని అధిగమించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ, స్టీల్‌ ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకును యాజమాన్యం సమకూరిస్తే, అంకితభావంతో పనిచేయడానికి కార్మికవర్గం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు.ఇదే సమయంలో కార్మికుల ప్రయోజనాలను యాజమాన్యం విస్మరించరాదని హెచ్చరించారు. వచ్చేనెల వేతనాలు సకాలంలో చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని యాజమాన్యాన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు హెచ్చరించారు.సమావేశంలో సిఎండి అతుల్‌భట్‌తోపాటు హెచ్‌ఆర్‌, ఆపరేషన్స్‌, ఫైనాన్స్‌, కమర్షియల్‌ విభాగాల డైరెక్టర్లు, జనరల్‌ మేనేజర్లుతోపాటు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, జే అయోధ్యరామ్‌, వరసాల శ్రీనివాసరావు, విల్లా మోహన్‌ కుమార్‌, డి. అప్పారావు, కొమ్మినేని శ్రీనివాస్‌, డేవిడ్‌, జీవీ రమణారెడ్డి, శ్రీనివాస్‌ నాయుడు, మహాలక్ష్మి నాయుడు, సిహెచ్‌ సన్యాసిరావు, జగదీష్‌ పాల్గొన్నారు

స్టీల్‌ప్లాంట్‌

➡️