నూతన సంవత్సర వేడుకలలో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు : ఎస్సై శ్రీను నాయక్‌

ప్రజాశక్తి – ఆలమూరు (అంబేద్కర్‌ కోనసీమ) : నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ కుటుంబసభ్యులతో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై ఎల్‌.శ్రీను నాయక్‌ కోరారు. ఆదివారం రాత్రి జరుపుకునే నూతన సంవత్సర వేడుకలు సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని మీడియాకు తెలిపారు. వేడుకలు సందర్బంగా మండల పరిధిలో పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తారన్నారు. ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు నిర్ణీత సమయంలో ముగించుకోవాల్సి ఉంటుందని సూచించారు. ట్రాఫిక్‌నకు అంతరాయం కలిగించే విధంగా సామాన్య ప్రజలకు ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే అట్టి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలియజేసారు. ప్రతి ఏటా నూతన సంవత్సర వేడుకలలో మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ ఎంతోమంది తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోవడం, వికలాంగులుగా మారుతున్నారని తెలిపారు. బైక్‌ల సైలెన్సర్లు తీసివేసి రణగొణ ధ్వనులను చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వాహనాలు నడిపినా, మత్తు పదార్థాలను వినియోగించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా ఈ వేడుకల సమయంలో యువకులు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనీఖీల్లో పోలీసులకు పట్టుబడితే జరిమానాతోపాటు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు. వేగంగా వాహనాలు నడపడం, రోడ్లపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేసే విధంగా వ్యవహరిస్తే సదరు వాహనదారులకు చట్టపరమైన తిప్పలు తప్పబోవని తెలిపారు. మండలంలోని అన్ని ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అలాగే ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు అంక్షలను ఎవరైన అతిక్రమించినా, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే 9440904849 నంబర్‌కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వేడుకలను ప్రజలు, యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతరణంలో నిర్వహించుకోవాలని ఎస్సై శ్రీను నాయక్‌ విజ్ఞప్తి చేశారు.

➡️