ప్రశాంత పోలింగ్‌కు పటిష్ట చర్యలు

పోలీసులతో మాట్లాడుతున్న ఎస్‌పి మురళీకృష్ణ, చిత్రంలో జెసి జాహ్నవి తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి

జిల్లా పోలీస్‌ అధికారులు, సిబ్బంది సమిష్టిగా శ్రమించి పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అప్రమత్తతతో పని చేయాలని, నిష్పక్షపాతంగా ఎలాంటి అలసత్వం లేకుండా ఎన్నికల విధులు నిర్వర్తించాలని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ పిలుపునిచ్చారు. అనకాపల్లి నియోజకవర్గంలో పోలింగ్‌ విధులకు వెళ్తున్న సెక్టార్‌ పోలీసు అధికారులు/ రూట్‌ ఆఫీసర్లు సిబ్బందితో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో సోమవారం జరిగే పోలింగ్‌ రోజు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో దిశానిర్ధేశం చేశారు. పోలింగ్‌ లొకేషన్‌ బందోబస్తు సిబ్బంది నుండి మొబైల్‌ పార్టీలు, స్ట్రైకింగ్‌ ఫోర్సు, క్యూఆర్టీ, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ బృందాల వరకు అందరూ సమన్వయంతో శ్రమించాలన్నారు. ఏదైనా సమస్య ఉత్పన్నమయ్యే అవకాశముంటే వెంటనే ఉన్నతాధికారుల, ఎన్నికల అధికారుల దృష్టికి తీసికెళ్లి ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారమయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు. ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. క్యూలైన్‌ నిర్వహణ చేపట్టాలని, ప్రిసైడింగ్‌ అధికారి అనుమతి లేనిదే బందోబస్తు సిబ్బంది పోలింగు స్టేషన్లలోకి ప్రవేశించరాదని చెప్పారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ ముగిశాక ఓటింగు యంత్రాలు స్ట్రాంగు రూమ్‌లకు చేరే వరకు పటిష్ట భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ స్మరణ్‌ రాజ్‌, అనకాపల్లి సబ్‌ డివిజన్‌ డిఎస్పీ ఎస్‌.అప్పలరాజు, ట్రైనీ ఐపీఎస్‌ అధికారులు, కేంద్ర పోలీస్‌ దళాలు, జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

➡️