కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా చర్యలు

విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ విశాల్‌ గున్ని

విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ విశాల్‌ గున్ని

ప్రజాశక్తి-.అనకాపల్లి : అనకాపల్లి పార్లమెంట్‌తోపాటు జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు వచ్చేనెల 4న జరగనున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ నిర్వహించుటకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాని విశాఖ రేంజ్‌ డీఐజీ విశాల్‌ గున్ని అన్నారు. ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన ఆదేశాల మేరకు జిల్లా ప్రజలందరూ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా జిల్లా యంత్రాంగానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. సోమవారం స్థానిక ఎస్‌పి కెవి.మురళీకృష్ణతో కలిసి, శంకరం గ్రామం, కలెక్టరేట్‌ వద్ద గల ఫ్యూచర్‌ వరల్డ్‌ పాఠశాలలో కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాట్లును, స్ట్రాంగ్‌రూం భద్రతను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేయుట తదితర అంశాలపైనా, స్ట్రాంగ్‌ రూములో ఈవీఎంలు, వీవీప్యాట్‌ల, కంట్రోల్‌ యూనిట్‌ రక్షణకు కేంద్ర బలగాలు, ఆర్మ్డ్‌ రిజర్వు, సివిల్‌ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాట్లును సమీక్షించారు. ఎన్నికల కౌంటింగ్‌ రోజు, తదనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తీసుకోవలసిన భద్రత చర్యల గురించి పోలీస్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్‌ రోజున 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని, అలాగే .కౌంటింగ్‌ ముగిసిన తర్వాత ఎటువంటి ఊరేగింపులు, ర్యాలీలు చేయకూడదని, ఎవరూ గుంపులుగా తిరగరాదని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనంతో వ్యవహరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్‌ శాఖకు సహకరించాలని డిఐజి సూచించారు. అదనపు ఎస్‌పి బి.విజయభాస్కర్‌, అనకాపల్లి డిఎస్‌పి ఎస్‌.అప్పలరాజు, ఎస్‌బి డిఎస్‌పి బి.అప్పారావు పాల్గొన్నారు.

కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటును పరిశీలిస్తున్న విశాఖ రేంజ్‌ డీఐజీ విశాల్‌ గున్ని

➡️