నష్టపోయిన రైతును ఆదుకోండి : పుట్లూరు మండల సిపిఎం కమిటీ

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : రైతు పండించిన ఉల్లి పంటకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. సదరు రైతు బ్రహ్మయ్య పొలాన్ని బుధవారం ఉదయం పుట్లూరు మండల సిపిఎం కమిటీవారు పరిశీలించారు. రైతును పరామర్శించారు. మండలంలోని రామలింగాయపల్లి లో బ్రహ్మయ్య రైతు పొలంలో పండించిన సుమారు 200 క్వింటాళ్ళ ఉల్లిగడ్డలను నిల్వ ఉంచారు ఆ పంటకు బుధవారం గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పంటలో కొంతభాగం కాలి బూడిదయ్యింది. ప్రభుత్వ అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతును ఆదుకోవాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిని అరెస్టు చేయాలని, పోలీసులు కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ ఇలాంటి దుశ్చర్యలు మండలంలో పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పుట్లూరు మండల కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.సూరి, రైతు సంఘం మండల కార్యదర్శి జి వెంకట చౌదరి, భాస్కర్‌ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పెద్దయ్య, కెవిపిఎస్‌ నాయకులు నాగభూషణం, రైతులు జగదీష్‌, హరి, గోవిందు, రవి, నాయుడు, గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

➡️