కౌలు, పేద రైతులకు ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలి

Dec 7,2023 12:50 #Konaseema
support to farmers

సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి అమలాపురం రూరల్ : మిచౌంగ్ తఫాను ధాటికి చేతికందొచ్చిన పంటను కోల్పోయిన కౌలు,పేద రైతులకు ఎకరాకు రూ.30 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అమలాపురం మండలం వన్నె చింతలపూడి,తాండవపల్లి గ్రామాలలో తుఫాను కారణంగా తడిచిన ధాన్యాన్ని రైతుల కళ్ళాలలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెక్కలు ముక్కలు చేసి ప్రైవేటు అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్న కౌలు రైతులు ఒక్కసారిగా తుఫానుకి రెక్కల కష్టం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.30 వేలు వరకు పెట్టుబడి పెట్టామని కౌలు కలుపుకుని రూ.40 వేలు పైబడి అవుతుందని, చేతికి అందొచ్చిన పంట దెబ్బతినటంతో నీట మునిగిన వరి వెంటనే మొలక వచ్చిందని వారు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. కొంతమేర పంట కోసామని,ఆదాన్యం మొత్తం తుపాను కారణంగా తడిచి మెలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసారు. తక్షణం కౌలు రైతుల పేరున పంట నష్టం నమోదు చేసి ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.జిల్లాలో సుమారు 1.60 లక్షల ఎకరాల సాగు చేస్తుండగా 50% మాత్రమే మాసూళ్ళు జరిగాయని మిగిలిన 50% పంట తుపాన్ కారణంగా రైతులు నష్ఠ పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, తేమ శాతం చూడకుండా దాన్యాన్ని కొనుగోలు చేసి,రైతుల కళ్ళాలనుండే మిల్లులకు తరలించే ఏర్పాటు ప్రభత్వమే చేయాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో కౌలు రైతులు రామకృష్ణ, లంక సత్యనారాయణ, కుటుంబరావు, ఎం శ్రీను, పి ప్రసాద్, కృష్ణ తదితరులు పాల్గోన్నారు.

➡️