టిడిపి, వైసిపి పోటా పోటీగా ర్యాలీలు

May 11,2024 20:54

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌: సాధారణ ఎన్నికలకు ప్రచారం గడువు ముగుస్తున్న సందర్భంగా శనివారం వైసిపి, టిడిపి పార్వతీపురం పట్టణంలో భారీగా ర్యాలీలు నిర్వహించారు. ముందుగా వైసిపి తమ మద్దతుదారులతో స్థానిక పాతబస్టాండ్‌ నుండి బెలగాం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించగా, రెండు గంటల వ్యవధిలో టిడిపి అభ్యర్థి బోనెల విజరుచంద్ర తమ మద్దతుదారులతో కలిసి పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దీనికి ముందుగా వైసిపి అభ్యర్థి ఎమ్మెల్యే అలజంగి జోగారావు మండలంలోని కోరి, కవిటిభద్ర, హిందూపురం, దిబ్బగుడ్డివలస, పెదబొండపల్లిలో ప్రచారం నిర్వహించారు. అలాగే టిడిపి అభ్యర్థి బోనెల విజరు చంద్ర పట్టణంలోని ఆరో వార్డులో పర్యటించి స్థానిక కౌన్సిలర్లు కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు కోఆప్షన్‌ సభ్యుడు గుంట క్రాంతికుమార్‌ కూడా పార్టీలో చేరారు. గడువు ముగియనుండడంతో ఇరువురు అభ్యర్థులు ప్రచారాలను నిలిపివేసి ఎన్నికల నిర్వహణపై దృష్టిని సారిస్తున్నారు. బూత్‌ ఏజెంట్ల నియామకం, ఓటర్ల జాబితాను పంపిణీ గ్రామాల్లో రహస్య సమావేశాలకు తెరతీస్తున్నారు.

➡️