పాలస్తీనాపై దాడులను తక్షణమే ఆపాలి

Jun 17,2024 00:32

మాట్లాడుతున్న కెఎస్‌ లక్ష్మణరావు
ప్రజాశక్తి-గుంటూరు :
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణహోమాన్ని తక్షణమే ఆపాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. బ్రాడీపేటలోని యుటిఎఫ్‌ హాల్లో ఎస్‌.హనుమంత్‌రెడ్డి అధ్యక్షతన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, విరసం నాయకులు సి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ పాల్గొని ప్రసంగించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ వదేళ్లుగా పాలస్తీనా దేశంపైన ఇజ్రాయిల్‌ చేస్తున్న దురాక్రమణల గురించి వివరించారు. ముఖ్యంగా గత 8 నెలలుగా సాగిస్తున్న మారణహోమంలో 36 వేల మందికిపైగా మరణించారని, తాజాగా మే 26న రఫాపై జరిగిన దాడిలో 45 మంది అమాయక ప్రజలు బలయ్యారని తెలిపారు. వీరిలో 20 మంది మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఆవేదన వెలిబుచ్చారు. అమెరికన్‌ సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఈ దుష్ట చర్యలు యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఇజ్రాయిల్‌ దాడులు సాగిస్తోందన్నారు. విరసం నాయకులు ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రఫా దాడులను ఖండిస్తూ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు సమ్మె చేయడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. అయితే భారతదేశంలో కూడా ఇలాంటి సంఘీభావ ర్యాలీలు ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి మాట్లాడుతూ ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో ప్రాంతాలవారీగా విస్తరిస్తూ ప్రపంచశాంతి కోసం కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఆవాజ్‌ నాయకులు ఎంఎ చిష్టీ, బాషా, సలీం, భారత్‌ బచావో నాయకులు కె.నవజ్యోతి, ఐద్వా నాయకులు అరుణ, పద్మ, యుటిఎఫ్‌ నాయకులు ఎం.కళాధర్‌, షకీలా బేగం, వి.వి.కె.సురేష్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు జి.ప్రభుదాస్‌ పాల్గొన్నారు.

➡️