శ్మశాన వాటికనూ వదల్లా..

– ట్రాక్టర్‌తో దున్ని పంట వేసిన వైనం

– ఆక్రమణదారులకు అధికార పార్టీ అండ

– పట్టించుకోని అధికారులు

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం పాతశింగరాయకొండ పంచాయతీ పరిధిలోని గిరిజనులు శ్మశాన వాటిక లేక అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పాత శింగరాయకొండ పంచాయతీ పరిధిలోని బాలిరెడ్డినగర్‌, మల్లికార్జున నగర్‌, పోతుల చెంచయ్య కాలనీ, గుజ్జుల యలమందరెడ్డి నగర్‌ ప్రజల కోసం సర్వే నంబర్‌ 105లో సుమారు 4 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు శ్మశాన వాటిక కోసం కేటాయించారు. ప్రస్తుతం శ్మశాన వాటిక కోసం కేటాయించి స్థలం విలువ కోట్లలాది రూపాయలకు చేరింది. ఇటీవల కొందరు వైసిపి నాయకులు ఆ స్థలం తమదంటూ ముందుకొచ్చారు. పట్టించు కోవలసిన రెవెన్యూ అధికారులు చేతులెత్తేశారు. గత ఆరు నెలల క్రితం ట్రాక్టర్‌తో శ్మశాన వాటిక స్థలాన్ని దున్ని శవాలపైనే విత్తనాలు చల్లారు. దీంతో శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని అప్పటి నుంచి గిరిజనులు రెవెన్యూకార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉందటూ రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఈ స్థల విషయంలో గిరిజనులకు వైసిపి నాయకుడి మధ్య రచ్చ జరిగింది. దీంతో పోలీసులు సదరు నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ కేసు సంగతి ఏమైందో తెలియదు కానీ. ఈ భూమి విషయంలో రెవెన్యూ అధికారులు సైతం పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కారు. అప్పటి తహశీల్దారు ఉష తనను దూషించారని కేసు పెట్టింది. ఈ క్రమంలో ఆ భూమి తనదేనంటూ వైసిపి నాయకుడు కోర్టు మెట్లు ఎక్కాడు. రెవెన్యూ అధికారులకు, వైసిపి నాయకుడి మధ్య భూమి వివాదం జరుగుతున్న నేపథ్యంలో ట్రాక్టర్‌తో శ్మశాన వాటిక స్థలాన్ని దున్నేశారు. ఓ గిరిజనుడు చనిపోతే దున్నిన స్థలంలోనే మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. శ్మశాన వాటిక విషయంలో న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గిరిజనులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు మాట్లాడిన మాట్లాలతో గిరిజనులకు శ్మశాన వాటిక స్థలం దక్కుతుందా లేదా అని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

➡️