మోడీకి కౌంట్‌డౌన్‌ ప్రారంభం

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అ

టిడిపి, జనసేన, వైసిపి విధానాలు ఒక్కటే..

ఆ పార్టీలన్నీ బిజెపి పల్లకీ మోసేవే..-

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో

దేశంలో మోడీ సర్కారుకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి కొమ్ముకాస్తున్న టిడిపి, జనసేన, వైసిపిలకు విధానాల్లో ఏమాత్రమూ తేడా లేదని అన్నారు. గురువారం మధ్యాహ్నం విశాఖలోని గాజువాకలో ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టిడిపి, వైసిపి మధ్య విధాన, రాజకీయ, సిద్ధాంతపరమైన వ్యత్యాసం ఏమీ లేదని, అందుకే బిజెపి పల్లకీని ఇరు పార్టీలు మోస్తున్నాయని అన్నారు. చంద్రబాబు బిజెపి చంకనెక్కితే జగన్‌ బిజెపి పంచన చేరాడని ఎద్దేవా చేశారు. విద్యుత్‌ సంస్కరణల బిల్లు, ఆస్తి పన్ను పెంపు, రైతుల మోటార్లకు మీటర్లు బిగించే విధానాలకు ఎపిలో జగన్‌ అంగీకరించడం దారుణమన్నారు. ఈ బిల్లులన్నింటికీ చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి కూడా పార్లమెంట్‌లో ఆమోదం తెలిపిందన్నారు. సిపిఎం, వామపక్షాలు, ఇండియా వేదిక కాంగ్రెస్‌ మాత్రమే వీటిని వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు పక్షాల మధ్యనే పోటీ నెలకొందని, బిజెపికి కొమ్ముకాసేవి, అంటకాగేవి ఒక పక్షంకాగా, ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకెళ్తున్న ఇండియా వేదిక, సిపిఎం వామపక్షాలు మరో పక్షమని అన్నారు. దేశంలో ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ రూ.వేల కోట్లలో బిజెపికే అత్యధికంగా వెళ్లడం అందరికీ తెలిసిందేనన్నారు. సిపిఎం ఈ బాండ్ల విధానాన్ని వ్యతిరేకించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో టిడిపి, వైసిపిల్లో ఎవరికి ఓట్లేసినా ఒకటేనని, ఏ రాయితో కొట్టుకున్నా పళ్లు ఊడిపోవడం ఖాయమని ప్రజలకు హితవు పలికారు.ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై చంద్రబాబువి మోసపు మాటలుల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టిడిపి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని రాఘవులు అన్నారు. అయితే ఈ చట్టం దోపిడీ చేస్తుందన్నది నిజమేనన్నారు. విజన్‌-2020 పేరుతో గతంలో చంద్రబాబు దాదాపు ఇదే చట్టాన్ని తెచ్చారని, తాజా చట్టంలో అప్పిలేట్‌ అథారిటీ జ్యూడిషియల్‌కి కాకుండా రెవెన్యూకు పగ్గాలు ఇవ్వడాన్ని మాత్రమే ఆ పార్టీ తప్పుపడుతోందని తెలిపారు. చట్టాన్ని మొత్తంగా సమర్థించే పార్టీ టిడిపి అని విమర్శించారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం 1183 రోజులుగా కార్మికులు పోరాడుతుంటే సొంత గనులు ఇవ్వకుండా కేంద్రం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా బిజెపి చంకనెక్కిన చంద్రబాబు, పవన్‌ మాట్లాడడం లేదన్నారు. గతంలో గంగవరం పోర్టు స్టీల్‌ప్లాంట్‌కు అనుబంధంగా ఉండాలని కోరితే చంద్రబాబే అడ్డంపడిన విషయాన్ని గుర్తుచేశారు. స్టీల్‌ప్లాంట్‌ మనుగడకు మొట్టమొదటే చంద్రబాబునే దెబ్బకొట్టారని రాఘవులు ఉటంకించారు. సొంత గనుల్లేకుండా చంద్రబాబు హయాంలో ఎండగట్టారన్నారు. ఈ సమస్యలపై ప్రజాగళం వినిపించేందుకు కాంగ్రెస్‌ విశాఖ ఎంపీ అభ్యర్థి పి.సత్యారెడ్డిని, సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ విశాఖ ఎంపీ అభ్యర్థి పి.సత్యారెడ్డి మాట్లాడుతూ రూ.4 లక్షల కోట్ల విలువైన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేయాలని ప్రతిపాదన చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పైనా, ప్రధాని మోడీపైనా కేసు పెట్టి జైలుదాకా ఈడ్చుకెళ్తానని అన్నారు. సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ గాజువాక ప్రాంత సుస్థిర ప్రగతికి, కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దేందుకు, స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు తాను గెలిస్తే శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎజె.స్టాలిన్‌, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ డి.ఆదినారాయణ, కో – కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు రమణ పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బివి.రాఘవులు, చిత్రంలో సత్యారెడ్డి, జగ్గునాయుడు, తదితరులు

➡️