బిజెపి ఓటమితోనే దేశానికి ప్రగతి

Apr 30,2024 21:49

రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వినర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌  : బిజెపి అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కి, ఓటును బజారులో సరుకుగా మార్చిందని, దేశవ్యాప్తంగా జరగుతున్న సార్వత్రిక ఎన్నికలలో బిజెపిని ఓడిస్తేనే దేశం ప్రగతి బాటలో నడుస్తుందని భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, రాజ్యాంగ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ కె విజయారావుతో పాటుపలువురు వక్తలు అన్నారు. మంగళవారం పార్వతీపురం విజయలక్ష్మి కళ్యాణ మండపంలో సిపిఎంతో పాటు వామపక్ష పార్టీల అద్వర్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ అధ్యక్షతన జరిగిన ప్రజా అవగాహన సమావేశంలో వక్తలు మాట్లాడారు. శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కుల, మత, వర్గ ప్రాంత విభేదాలకు అతీతంగా, భారతీయులందరూ ఒక్కటే అన్న భావనను చెరిపేస్తూ మత ప్రాతిపదికన దేశాన్ని విభజించి, మెజారిటీ ప్రజల మద్దతును ఎన్నికలలో కూడగట్టి అధికారాన్ని నిలుపుకోవాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కృషిచేస్తుందని, దాని అనుబంధ సంస్ధలు కొన్ని చాప కింద నీరులా ఆ లక్ష్య సాధనకు పనిచేస్తూ ఉన్నాయని అన్నారు. కొన్ని కారణాల వలన మన రాష్ట్రంతో పాటు, కొన్ని రాజకీయ పార్టీలు బిజెపికి ముఖ్యంగా ప్రధాని మోడికి భయపడి వారికి మద్దతు నిస్తున్నాయని అన్నారు. బిజెపి నాయకులు రాజ్యాంగపీఠికలోని పేర్కొనబడిన సోషలిస్టు, సెక్యులర్‌ పదాలను తొలిగించాలని భావించడం త్వరలోనే రాజ్యాంగానికి జరగబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నాయని అన్నారు. డా. బిఆర్‌ అంబేద్కర్‌ అద్వర్యంలో రూపొందించిన భారత రాజ్యాంగం స్ధానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకువచ్చే ప్రమాదం కనుబడుతోందని వివరించారు. దేశంలో ఉన్న మైనారిటీలతోపాటు ప్రజాస్వామ్యవాదులు, దేశ ప్రజలు, మేథావులు, విద్యాధికులు విషయాలను లోతుగా అవగాహన చేసుకుని త్వరలో జరగబోయే ఎన్నికలలో బిజెపిని, దానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతిస్తున్న పొత్తు-తొత్తు పార్టీలను ఓడించి, ఇండియా కూటమి పార్టీలు, దాని మిత్ర పార్టీలైన సిపిఎం,సిపిఐ, కాంగ్రెస్‌ అధ్యర్ధులను గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. అరకు పార్లమెంటు కూటమి అభ్యర్ధి సిపిఎం పార్టీకి చెందిన పాచిపెంట అప్పలనర్స, కురుపాం శాసనసభ అభ్యర్థి మండంగి రమణ, పార్వతీపురం శాసనసభ కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తిన మోహనరావులను గెలిపించి చట్టసభలకు పంపించాలని కోరారు.

సమావేశంలో భారత్‌బచావో రాష్ట్ర నాయకులు జి.సీతాలక్ష్మి, జివి రంగారెడ్డి, రిటైర్డు ఐఎఎస్‌ అధికారి బండ్ల శ్రీనివాస్‌, రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు ఝాన్సీ, ఎపి రైతుసంఘం రాష్ట్ర నాయకులు మర్రాపుసూర్యనారాయణ, ఆప్‌ మహిళారాష్ట్ర నాయకులు డాక్టర్‌ శీతల్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి, సిపిఐ నాయలు కూరంగి మన్మధరావు, రైతుకూలీ సంఘం నాయకులు డి.వర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డివేణు, సిఐటియు నాయకులు విఇందిర తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీలకే ఓటు వేయాలి

వడ్డెశోభనాదీశ్వరరరావు, భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్‌ గత పదేళ్ల బిజెపి పాలనలో దేశంలోని ఏ వర్గానికి చెందిన ప్రజల్లోనూ మార్పు రాలేదు. నీటిపారుదల రంగాలను విస్మరించి రైతులు పంటలు పండించే అవకాశంలేక, మద్దతు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్ధితికి దేశాన్ని దిగజార్చిన బిజెపి ప్రభుత్వాన్నిఅధికారంలోకి రాకుండా చేయాలి. దేశాన్ని కార్పొరేట్‌ శక్తులు దోచుకోకుండా నివారించాలి. అందుకు కాంగ్రెస్‌ పార్టీతో కూడిన ఇంటియా వేదిక అభ్యర్ధులను గెలిపించి, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కదలిరావాలి.

ప్రశ్నించే గొంతులను చట్టసభలకు పంపాలి

భారతరాజ్యాంగ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ కె విజయారావు

చట్టసభలలో పాలకపక్షాలను ప్రశ్నించే బలమైన గొంతులు లేకపోవడం వలన, మెజారిటీ బలం చూసుకుని ప్రభుత్వాలు నిరంంకుశంగా వ్యవహరిస్తున్నాయి. దేశ పౌరులకు కనీస అవసరాలైన విద్యా, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి కల్పనలో దాదాపు 80 శాతం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వలన దేశం వందేళ్లు వెనుకకు వెళ్లిపోయే ప్రమాదంలో పడింది. దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి, పార్లమెంటులో ప్రశ్నించే గోంతులైన సిపిఎం, సిపిఐతో పాటు ఇండియా కూటమిని గెలిపించాలి.

 

 దేశానికే ప్రమాదం

రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు ఝాన్సీ బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోని అన్ని వర్గాల ప్రజలపై దాడులు చేస్తున్నది. దేశంలోని 100 మంది సంపదను తీసుకువెళ్లి 10 మంది ధనికుల చేతుల్లో పెట్టే విధానం అమలు జరుపుతోంది. ఇబ్బడిముబ్బడిగా ధరలను పెంచి, జిఎస్‌టి వసూలు చేసుకోవడమే లక్ష్యంగా దోపిడి విధానాలను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేనలు కేంద్రంలోని మోడీకి దాసోహంగా వ్యవహరించడం ప్రజాద్రోహం. జరగబోయే ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోకపోతే, ఉన్న కాస్త స్వాతంత్య్రం కూడా ప్రజలు కోల్పోయే ప్రమాదం ఉంది.

ధనికులకు సబ్సీడీలు, పేదలకు పన్నుల భారం

రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి బండ్ల శ్రీనివాసరావు

పేదల డబ్బులు, పెద్దలకు దోచిపెట్టే పాలనకు ముగింపు పలకకపోతే, దేశంలోని ప్రజలు తమకు తెలియకుండానే ఆర్ధికంగా దిగజారిపోయే స్ధితికి చేరుకుంటారు. రైతులకు మేలు కలిగించే స్వాయినాధన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయకపోగా, రైతు ఉద్యమంపై కిరాతకంగా వ్యవహరించి, స్వామినాధన్‌, చౌదరి చరణ్‌సింగ్‌లకు భారతరత్నలు ఇవ్వడం రైతులను మభ్యపెట్టి ఓట్లు దండుకునే వ్యవహారం, దీన్ని ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించడం ద్వారా అడ్డుకోవాలి.

 బిజెపి పాలనలో మహిళలపై అంతులేని అత్యాచారాలు

బారత్‌ బచావో నాయకురాలు జి.సీతామహాలక్ష్మి

బిజెపి అధికారంలోకి వచ్చిన పదేళ్లలో దేశంలో మహిళలపై అంతులేని అత్యాచారాలు పెరిగిపోయాయి. అందుకు నమోదైన 4లక్షల అత్యాచారాల కేసులే నిదర్శనం. అందులో 32వేల కేసులు కేవలం మానభంగాలకు సంబంధించి ఉండడం దేశంలో నాయకులు తల దించుకోవాల్సిన విషయం. రెజ్లర్లపై క్రీడాశాఖ మంత్రిపై అత్యాచార ఆరోపణలు, మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగింపు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బిజెపిని అధికారంలోనుండి తప్పక తొలగించాల్సిందే.

➡️