కూర్మరాజుపేటలో దాహం కేకలు

Apr 29,2024 21:01

ప్రజాశక్తి – సాలూరు : మండలంలోని కూర్మరాజుపేటలో గత కొద్దిరోజులుగా తాగునీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సక్రమంగా విద్యుత్‌ సరఫరా కాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్‌ సరఫరా ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాగునీటి సరఫరాతో పాటు రాత్రి వేళల్లో కూడా పూర్తిగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో ఈ గ్రామానికి సాలూరు సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరిగేది. పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న కూర్మరాజుపేటకు పట్టణ సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరిగినంత కాలం ఎలాంటి సమస్యలు లేవు. కానీ కొద్దిరోజుల క్రితం ఈ గ్రామానికి విద్యుత్‌ సరఫరాను మామిడిపల్లి సబ్‌ స్టేషన్‌ నుంచి సరఫరా చేస్తున్నారు. దీంతో తరచుగా విద్యుత్‌ సరఫరాలో ఆటంకాలు కలుగుతున్నాయి. ఎప్పుడు విద్యుత్‌ సరఫరా ఉంటుందో తెలియని అయోమయంలో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటిలాగే తమ గ్రామానికి సాలూరు సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. అయినా విద్యుత్‌ అధికారులు స్పందించడం లేదు. అధికారులు తమ సమస్యలను పరిష్కరించకపోతే ఎడిఇ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు.

➡️