కార్మికులకు ద్రోహం చేస్తున్న పార్టీలకు బుద్ధిచెప్పాలి

Apr 11,2024 21:22

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : కార్మిక హక్కులను కాలరాస్తూ, హక్కుల రక్షణ చట్టాలను రద్దు చేస్తున్న ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. గురువారం స్థానిక సుందరయ్య భవనంలో సిఐటియు విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమిస్తే ఎన్నడూ లేనివిధంగా నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాలపై ఎస్మా చట్టం ఉపయోగించి కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను పాలకులు కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని, దీనిపై కార్మికులు ఉక్కు పట్టుదలతో పోరాడుతున్నారని అన్నారు. ప్రభుత్వ సంపదను కార్మికుల కష్టాన్ని పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, కార్మికుల మధ్య మత ఆధారంగా గొడవల సృష్టించి భారత రాజ్యాంగ లౌకిక తత్వాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాల్సి ఉండగా ఆ విధంగా అమలు చేయకుండా కార్మికుల జీవితాలతో ఆట్లాడుకునే పరిస్థితి ఉందని అన్నారు. ఇలాంటి సందర్భంలో భవన కార్మికులు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు కూడా అమలు చేయని పరిస్థితి ఉందన్నారు. మున్సిపల్‌, సమగ్ర శిక్షణ, గ్రీన్‌ అంబాసిడర్లు, కాంట్రాక్ట్‌, అన్ని రకాల కార్మికులు సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. కరోనా సమయంలో మున్సిపల్‌, అంగన్వాడీ, ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు ప్రాణాలు తెగించి సేవలందించినా వారి కుటుంబాలకు ి ఎటువంటి భరోసా కల్పించలేదన్నారు. ఉపాధి కూలీలకు పనులు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. కావున కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేసి, చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలని, రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, నాయకులు వి.ఇందిర, ఎన్‌వై నాయుడు, ఆర్‌.రాము, బి.సూరిబాబు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️