ఆస్పత్రి పనితీరు గాడిన పడేనా..

Jun 16,2024 21:43

ప్రజాశక్తి-పాలకొండ : కొత్తగా ఏర్పడిన ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వంలోనైనా స్థానిక ఏరియా హాస్పటల్‌లో వైద్యసేవలు మెరుగుపడతాయన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సేవల విషయంలో మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదైనా అత్యవసర సమయంలో వెళ్లే రోగులకు ఇక్కడి ఏరియా ఆస్పత్రిలో వైద్యం ఎప్పుడూ అందడంలేదన్న విమర్శలు సర్వత్రా ఉన్నాయి. రోగి పరిస్థితి చూసి ధైర్యంగా వైద్యం చెయ్యాల్సిన డాక్టర్లే , రోగి బంధువులను భయపెట్టి వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కు, లేకుంటే వేరే హాస్పిటల్‌కు రిఫర్‌ చేసేస్తారన్న అపవాదం మూట కట్టుకున్నారు. స్థానిక ఏరియా హాస్పిటల్‌ మీద అవగాహన ఉన్న ఏ ఒక్కరూ అత్యవసర సమయాల్లో తమ రోగులను ఇక్కడకు తీసుకురావడం లేదు. ఇక్కడకు తీసుకొని వెళ్లినా వెంటనే రిఫర్‌ చేయడం తప్ప వారు అందించే వైద్య సేవలేమీ ఉండవు. అందుకే ఇక్కడకు తీసుకొచ్చినా సమయం వృథా చేసుకునే బదులు మరో పెద్ద హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లి ప్రాణం కాపాడుకుందామనే భావనతో అవగాహన ఉన్నవారెవరూ ఆపదలో ఉన్న తమవారిని ఇక్కడకు తీసుకురారు. అలా అని ఇక్కడ ఉన్న డాక్టర్లు ఎవరైనా కొత్తవారా అంటే కాదు. ప్రతి ఒక్కరూ ఆయా విభాగాల్లో మంచి నిష్ణాతులైన వైద్యులే. ఇంచుమించు ప్రతి డాక్టర్‌ పాలకొండలో సొంతంగా ప్రయివేటు హాస్పిటళ్లు నడుపుతున్నవారే. తమ హాస్పిటల్లో ఒకరకంగా, అదే ఏరియా హాస్పిటల్‌లో అయితే మరో రకంగా వీరు చికిత్స అందిస్తారనే భావన ప్రజల్లో ఉంది. ఇటీవలే ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో స్థానిక ఏరియా ఆస్పత్రికి వెళ్తే ఆయన పరిస్థితి గమనించిన వైద్యబృందం ఈయన షుగర్‌ లెవెల్స్‌ 700కు చేరాయని, ఇక్కడ వైద్యం ఇవ్వలేమని చెప్పి కనీసం ఇన్సులిన్‌ కూడా ఇవ్వకుండా వారి ఇంట్లో వారిని కంగారుకు గురిచేశారు. దీంతో వెంటనే ఆ వ్యక్తిని విశాఖలోని ఓ ప్రయివేట్‌ హాస్పిటల్‌కు తరలించగా ఆ వ్యక్తి ఒక రోజు వ్యవధిలో డిశ్చార్జ్‌ అవ్వడం గమనార్హం. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ఏరియా హాస్పిటల్‌ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా స్థానిక ఎమ్మెల్యేనే ఉంటారు. ఈసారి ప్రస్తుత ఎమ్మెల్యే జయకృష్ణ హయాంలోనైనా హాస్పిటల్‌ పనితీరులో మార్పు రావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో విస్తతంగా తిరిగి వారి కష్టనష్టాలు తెలుసుకుని కష్టాల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి తన తోడ్పాటు అందించారని పేరు తెచ్చుకున్న జయకృష్ణ ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగానూ, ఏరియా హాస్పిటల్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కావున ఆస్పత్రి పనితీరును మెరుగుపరుస్తారని నియోజకవర్గ ప్రజలు గంపెడాశలతో ఉన్నారు. వీరి ఆశలను ఎమ్మెల్యే ఏ మేరకు నెరవేర్చేందుకు ఆస్పత్రి పనితీరును గాడిలో పెడతారో వేచి చూడాల్సిందే.

➡️