అక్రమాలకు అడ్డుకట్టు లేదా..?

Jun 16,2024 20:56

నగర పంచాయతీలో ప్రభుత్వ స్థలాలు జోరుగా అక్రమాలకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అనుమతి లేని భవన నిర్మాణాలు అడ్డుకునే వారు లేరా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. పటిష్ఠ మైన సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత కూడా నగర పంచాయతీలో అక్రమాలు పెరిగిపోయాయని చర్చ జరుగు తుంది. సమస్యలు, అక్రమాలపై ఫిర్యాదు చేస్తే సదరు ఫిర్యాదు తీసుకున్న వారు నేరుగా అక్రమార్కులకు సమాచా రమిచ్చి మీరు మీరు చూసుకొండని తప్పించుకుంటున్నారు. నగర పంచాయతీ కార్యాలయం కూడా అదృశ్య శక్తుల చేతిలో నడుస్తుందని నాయకులు, అధికారులు కూడా ఉత్సవ విగ్రహాల మాదిరి వ్యవహరిస్తున్నారని పలు విమర్శలు వినవస్తున్నాయి. 

ప్రజాశక్తి – నెల్లిమర్ల: ఇటీవల మొయిద జంక్షన్‌ సచివాలయ పరిదిలో థామస్‌ పేటలో కోర్టులో కేసు నడుస్తుండగా ఇంటి నిర్మాణం చేపట్టడంపై ఫిర్యాదులు చేసినప్పటికీ నగర పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది కంటి తుడుపు చర్యలు చేపట్టి చేతులు దులుపుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇదే సచివాలయ పరిధిలో సినిమ హాల్‌ ప్రాంగణంలో రహదారి భవనాల శాఖ స్ధలంలో అనుమతి లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేస్తున్నా నగర పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది కోర్టులో కేసు వేయడం తప్పితే అక్రమ నిర్మాణాన్ని నిలువరించ లేకపోయారని స్థానికులు చర్చించు కుంటున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండా ఏడంతస్తుల భవనాన్ని ఇక్కడ నిర్మించి అధికారులకే అక్రమార్కులు సవాల్‌ విసిరారు. కాగా రామతీర్ధం జంక్షన్‌ సమీపం సర్వే నంబర్‌ 90లో మెట్ట ఉండగా దాన్ని అక్రమా ర్కులు రాయి, గ్రావెల్‌ అమ్ముకోవడమే కాకుండా మెట్టను ఆక్రమించుకొని నిర్మాణాలు కూడా జరుపుతున్నారు. అధికా రులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.తెరపైకి నకిలీ పట్టాల వివాదంఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నకిలీ పట్టాలను సృష్టించి విక్రయించడంతో ఇటీవల నకిలీ పట్టాల వివాదం తెరపైకి వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాలు ఒక పక్క ఆక్రమణలు జరుగుతుండగా నకిలీ పట్టాలు వివాదాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో రెవెన్యూ గాని, నగర పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది కూడా పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికార్లు కళ్ళు తెరిచి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

➡️