నీట్‌ పరీక్ష నిర్వహణపై సమగ్ర విచారణ జరిపించాలి

Jun 20,2024 19:43

 నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీని రద్దు చేయాలి

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన ర్యాలీ, మానవహారం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు డి.రాము, సిహెచ్‌ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుండి బాలాజీ జంక్షన్‌ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలాజీ జంక్షన్‌ వద్ద మానవహారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్‌ యూజీ 2024 ఫలితాల్లో హర్యానాకు చెందిన ఒకే పరీక్షా కేంద్రంలో ఏడుగురు విద్యార్థులకు ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌ రావడం, వారందరికీ 720/720 మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు వస్తున్నాయన్నారు. అదే సెంటర్లో ఎగ్జామ్‌ రాసిన జాన్వీ అనే విద్యార్థిని 179 ప్రశ్నలను అట్టెంప్ట్‌ చేయగా అందులో 163 కరెక్ట్‌ అయ్యాయని, ఆమెకు 636 మార్కులు రావాల్సి ఉండగా 720/720 ఎలా వచ్చాయంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయన్నారు. ఎంతో మంది విద్యార్థులకు సాధ్యం కాని విధంగా 718, 719 మార్కులు వచ్చాయని ప్రశ్నించారు.

నీట్‌ ఎగ్జామ్‌ వివాదంపై ఎన్‌టిఎ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) వివరణ ఇస్తూ పరీక్షలో సమయం కోల్పోయినట్లు నివేదించిన అభ్యర్థులకు గ్రేస్‌ మార్కులు ఇవ్వడం వల్ల 718, 719 మార్కులు వచ్చాయని, మరియు ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉన్నాయి అందువల్ల రెండు ఆప్షన్లు సరైనవిగా ప్రకటించి.. 44 మంది అభ్యర్థుల మార్కులు 715 నుంచి 720కు పెరిగాయని వివరించిందన్నారు. కానీ కొంత మంది విద్యార్థులకు 100 పైగా గ్రేస్‌ మార్కులు కలిపారన్నారు. ఇదిలా వుంటే మొదటి సారి జూన్‌ 14న ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించి, ఎన్నికల కౌంటింగ్‌ రోజున (జూన్‌ 4) పరీక్షా ఫలితాలు విడుదల చేయటంతో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలన్నీటిపైనా విచారణ జరిపించాలని, పరీక్ష నిర్వహణలో వైఫల్యం చెందినందుకు ఈ ఏజెన్సీ ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి జె రవి, ఉపాధ్యక్షులు సమీరా, నాయకులు రమేష్‌, సోమేశ్‌, గుణ రాజు, భారతి, వెంకటరమణ, దుర్గాప్రసాద్‌, అక్షరు, వందలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు.
➡️