దేశ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకం

May 10,2024 23:35

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజ్యాంగాన్ని రద్దు చేయాలని యత్నిస్తున్న బిజెపికి ఈ ఎన్నికల ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని సిపిఐ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఇండియా వేదిక బలపరచిన గుంటూరు పార్లమెంట్‌ స్థానం సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్‌ మస్తాన్‌వలి విజయాన్ని కాంక్షిస్తూ గుంటూరు విజయటాకీస్‌ ప్రాంగణంలో శుక్రవారం బహిరంగ సభ నిర్వహించారు. సభకు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు అధ్యక్షత వహించారు. డి.రాజా మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, ఫెడరలిజంపై దాడి జరుగుతోందన్నారు. మోదీ చెబుతున్న సబ్‌కా సాత్‌… సబ్‌కా వికాస్‌ కేవలం అంబానీ, అదానీలకే పరిమితమైందని, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వికాస్‌ కనిపించడం లేదని, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు కష్టాల్లో ఉన్నా మోదీ కనబడటం లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌లకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ విధానాల కారణంగా ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి నష్టం కలిగేలా పాలన ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేదని, హోదా అమలు చేయలేదని, పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితుల సమస్యనూ పరిష్కరించలేదని అన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ప్రత్యక్షంగా, జగన్‌మోహన్‌రెడ్డి పరోక్షంగా బిజెపితో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీలను ఓడించాలని, గుంటూరు ఎంపీగా జంగాల అజరుకుమార్‌ను, మంగళగిరిలో జొన్నా శివశంకర్‌ను, మిగతా చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మాట్లాడుతున్న సీతారాం ఏచూరి, పక్కన ఎంపీ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌
సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఇండియా వేదిక గెలుపు అనివార్యమన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగ శాతం పెరిగిపోయిందని, ఇది సమాజానికి మంచిది కాదని అన్నారు. పెరిగిన ధరల కారణంగా 90 శాతం కుటుంబాలు అప్పులతో బతుకీడుస్తున్నాయని, 100 కోట్ల మంది ప్రజల చేతిలో ఉండాల్సిన సంపద కేవలం 22 మంది గుత్త కోటీశ్వర్ల చేతిలో ఉందని చెప్పారు. వీటిపై మోదీ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. అమృతకాల్‌ రావాలంటే మోదీని గద్దెదించాలని, లౌకికవాద ప్రభుత్వాన్ని దేశంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇండియా వేదిక గెలిస్తేనే దేశాన్ని కాపాడుకోలేమని స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఓట్లు కొని గద్దెనెక్కాలనే ప్రయత్నం చేస్తున్నారని, రూ.వేల కోట్లు ఉన్నవారు ఎమ్మెల్యే, ఎంపీలుగా చట్టసభలకు వెళితే పేదలు, కార్మికులు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, ముస్లిం మైనారిటీల తరుపున మాట్లాడే వారు ఎవరుంటారని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న మోడి, చంద్రబాబులు 2024లో కలిసి పోటీకి వెళుతున్న మోసాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. దేశంలోనే అత్యంత ధనికుడైన ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌పై సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ పోటీ చేయబోతున్నారని, అజరుకుమార్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని చెప్పారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ మోడీని చూస్తే చంద్రబాబు వణికిపోతున్నారని, జగన్‌, చంద్రబాబు ఇద్దరూ మోడీని భుజాలపై మోస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు మాట్లాడుతూ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ అంగీకారం తెలిపిందని, దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిందని అన్నారు. స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలైతే రైతులకు ఎంతో మేలన్నారు. గుంటూరు జిల్లాలో అత్యధిక ప్రజానీకం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని, వీరందరూ ఆలోచించి ఇండియా వేదిక అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. తొలుత బీఆర్‌ స్టేడియం నుంచి బహిరంగ సభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో వేదికపైకి వక్తలను సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఆహ్వానించారు. జంగాల అజరుకుమార్‌, షేక్‌ మస్తాన్‌వలి, కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ అభ్యర్థి డాక్టర్‌ జాన్‌బాబు, ప్రత్తిపాడు అభ్యర్థి కొరివి వినరుకుమార్‌, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, జాతీయ నాయకులు ఎ.వనజ, రాష్ట్ర నాయకులు కేవీవీ ప్రసాద్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పాశం రామారావు, నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌, ఇప్టా జాతీయ కార్యదర్శి గని, అవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి చిష్టీ, కాంగ్రెస్‌ నాయకులు వెంకటరెడ్డి, రత్తయ్య పాల్గొన్నారు.
ప్రదర్శనలో ఎంపీ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ పక్కన డి.రాజా

➡️