టిడ్కో ఇళ్లను ఎపుడిస్తారో..!

టిడ్కో ఇళ్లు

ఐదేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు

ఎన్నికల ముందు గృహప్రవేశాల హడావిడి

నేటికీ లబ్ధిదారులకు అందని వైనం

ప్రజాశక్తి- పెందుర్తి : జివిఎంసి 92వ వార్డు పద్మనాభపురంలో నిర్మించిన 656 టిడ్కో ఇళ్లు నేటికీ లబ్ధిదారులకు అందని పరిస్థితి ఉంది. టిడిపి ప్రభుత్వ హయాంలో వీటిని నిర్మించడంతోపాటు అప్పట్లోనే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కూడా చేపట్టారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడం, వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లుగా వీటిని పట్టించుకోకపోడంతో లబ్ధిదారులకు పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. దీంతో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు అద్దెఇళ్లల్లో ఐదేళ్లుగా కాలం వెల్లదీస్తూ, తమపేరిట మంజూరైన టిడ్కో ఇళ్లు ఎపుడిస్తారా అంటూ ఎదురుచూస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు కేవలం మూడు రోజుల ముందు గృహప్రవేశాలంటూ వైసిపి నేతలు హడావిడి చేసినా, వెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఈ తంతు అక్కడితో ఆగిపోయింది. టిడిపి హయాంలో నిర్మించారన్న ఒకేఒక్క కారణంతో ఐదేళ్లపాటు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన టిడ్కో ఇళ్లను వైసిపి ప్రభుత్వం కావాలనే తమకు పంపిణీ చేయలేదని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల తంతు ముగిసినప్పటికీ, కొత్త ప్రభుత్వం ఏర్పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై దృష్టి పెట్టేందుకు మరికొన్నాళ్లు సమయం తీసుకునే పరిస్థితి ఉన్నందున ఎప్పటికి తమకు అందుతాయోనని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

పద్మనాభపురంలోని టిడ్కో గృహ సముదాయం

➡️