గతం కన్నా ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

గతం కన్నా ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

గతం కన్నా ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలుప్రజాశక్తి-శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా, వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను గతంకన్నా ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆలయ పరిపాలనా భవనంలో మహాశివరాత్రి ఏర్పాట్లు, ఉత్సవాల విజయవంతంపై ఈవో మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రతి ఏటా నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉందన్నారు. స్వామీ అమ్మవార్ల దర్శనార్థం లక్షల కొద్దీ భక్తులు తరలి వస్తుంటారని చెప్పుకొచ్చారు. గతేడాది నిర్వహించిన ఉత్సవాలకు లక్షకు పైగా భక్తులు స్వామీ అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ సారీ లక్షకు పైగా భక్తులు రానున్నట్లు సమాచారమన్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కనీస సౌకర్యాలపై ప్రధానంగా దష్టిసారించినట్లు తెలియజేశారు. భక్తుల కనీస అవసరాలైన తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్‌, ట్రాఫిక్‌, నీడ ప్రదేశాలు, స్నాన ఘట్టాలు, క్యూలైన్లు, అన్న ప్రసాదాలు ఆ మేరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల తాకిడి దష్ట్యా’ చోరీలు జరగకుండా ఈ ఉత్సవాల్లో సీసీ కెమేరాలతో పాటు వాచ్‌ టవరు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా రెండు మార్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దూర్జటి కళా ప్రాంగణాన్ని రాజగోపురం వద్దకు మార్చి ఆ ప్రదేశాన్ని పార్కింగ్‌ కు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే దూర్జటి కళా ప్రాంగణం వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేస్తే దాని ప్రాశస్థ్యం దెబ్బతింటుందనీ, ట్రాఫిక్‌ కష్టాలు కూడా ఏర్పడతాయని పాత్రికేయులు సూచించడంతో పరిశీలించి మార్పులు చేస్తామని తెలిపారు.

➡️