టిడిపిలోకి కోనేటి ఆదిమూలంరాజధానిలో లోకేష్‌ చెంత మంతనాలు

టిడిపిలోకి కోనేటి ఆదిమూలంరాజధానిలో లోకేష్‌ చెంత మంతనాలు

టిడిపిలోకి కోనేటి ఆదిమూలంరాజధానిలో లోకేష్‌ చెంత మంతనాలుప్రజాశక్తి – పిచ్చాటూరు సత్యవేడు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలం త్వరలోనే టిడిపి కండువా కప్పుకోనున్నారు. మంగళవారం రాజధాని అమరావతిలో యువనేత నారా లోకేష్‌తో కలిసి ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ చర్చకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అనుచరగణం కోనేటి ఆదిమూలం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం గమనార్హం. సిఎం జగన్మోహన్‌రెడ్డి జరిపిన సర్వేలో ఆదిమూలంకు ప్రతికూలంగా ఉందని చెప్పి సత్యవేడు నియోజకవర్గానికి ఎం.గురుమూర్తిని ఎంఎల్‌ఎ అభ్యర్థిగా ప్రకటించారు. సిట్టింగ్‌ ఎంఎల్‌ఎగా ఉన్న ఆదిమూలంను తిరుపతి ఎంపి అభ్యర్థిగా కుండమార్పిడి చేశారు. అయితే ‘నియోజకవర్గం’ వదిలి వెళ్లడం ఇష్టం లేని ఆదిమూలం స్థానికంగానే తాను ఉంటానంటూ తన అనుచరగణంతో వెల్లడించారు. అధిష్టానం ఏమాత్రం దిగిరాకపోవడంతో మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహించిన మంత్రి పెద్దిరెడ్డి కోనేటి ఆదిమూలంపై గుర్రుమన్నారు. దీంతో జీర్ణించుకోలేని ఆదిమూలం టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు తయారయ్యారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్‌ను కొడుకు సుమన్‌తో కలిసారు. పార్టీ తీర్థం పుచ్చుకునే విషయంలో ఇప్పటికే జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రితో మంతనాలు జరిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతోనూ టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కోనేటి ఆదిమూలం మీడియాతో మాట్లాడుతూ రాత్రనకా పగలనకా తనతో నడిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను ఎంఎల్‌ఎగానే పోటీ చేస్తానని, ఎంపిగా చేయనని మంత్రి పెద్దిరెడ్డిని కలిసి మాట్లాడానన్నారు. తనకు టిక్కెట్‌ ఇవ్వాలని అపరంజి రాజు, దశరథ, చిన్న, హరినాథ్‌ తదితర 80 మంది మంత్రిని కలిసారని తెలిపారు. తనకు తెలియకుండా ఈనెల 25, 26 తేదీల్లో ఎం.గురుమూర్తిని నియోజకవర్గం మొత్తం చుట్టించేలా చేశారని, 27న తిరుపతిలో తనకు తెలియకుండా ఆత్మీయ సమావేశం పెట్టారన్నారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి కొల్లగొడుతూ వాటి తరలింపుకు చెక్‌పోస్టును పెట్టుకున్న కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వడం న్యాయమేనా అని వాపోయారు. తనను రెచ్చగొట్టి రెబల్‌గా మార్చడానికే తిరుపతిలో ఆత్మీయ సమావేశం పెట్టారని మండిపడ్డారు. తన బాధను చెప్పుకుంటే తనను సస్పెండ్‌ చేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు. పిచ్చాటూరు వైకాపా కన్వీనర్‌ చలపతిరాజు ఆధ్వర్యంలో ‘దళిత ద్రోహి ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలం’ అని దిష్టిబొమ్మను జాతీయ రహదారిపై దహనం చేశారు. రమేష్‌రాజు, సుబ్రమణ్యంరెడ్డి, భాస్కర్‌నాయుడు, తొప్పయ్య, పాల పద్మనాభం పాల్గొన్నారు. బిఎన్‌ కండ్రిగ బస్టాండ్‌ సమీపంలో సీనియర్‌ నాయకులు ఉగ్గుమూడి గురునాధం, కంచనపుత్తూరు గురవయ్య, ప్రసాద్‌ పాల్‌ ఆధ్వర్యంలో ఆదిమూలం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

➡️