నేను లోకల్‌.. నువ్వు నాన్‌ లోకల్‌…

Mar 31,2024 22:49
నేను లోకల్‌.. నువ్వు నాన్‌ లోకల్‌...

నిన్ను కలవాలంటే ఫ్లైట్‌.. నన్ను కలవాలంటే ఆటోఅవినీతిపై దైవం వద్ద ప్రమాణంకు సిద్ధమా సుధీర్‌ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డిప్రజాశక్తి- శ్రీకాళహస్తి : నిరంతరం హైదరాబాదులో ఉండే నిన్ను ప్రజలు కలవాలంటే ఫ్లైట్‌ ఎక్కాలనీ, అదే నిత్యం శ్రీకాళహస్తిలో ఉండే నన్ను కలవాలంటే ఆటో చాలంటూ స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి కూటమి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. అవినీతిపై ఆవాకులు, చవాకులు పేలుతున్న సుధీర్‌ రెడ్డి వాటి నిరూపణకు దైవం వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమా..? అంటూ సవాల్‌ విసిరారు. స్థానిక వైసిపి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. శనివారం జరిగిన ప్రజాగళం రోడ్‌ షోలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తీరు హాస్యాస్పదమన్నారు. ఆయన వయసుకు తగ్గ మాటలు కాదని విమర్శించారు. ఎర్రచందనం, ఇసుక, మద్యంలో మాఫియా కింగ్‌ సుధీర్‌ రెడ్డిని పక్కన పెట్టుకొని నా పైన విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు ప్రజాగళం రోడ్‌ షోకు కనీసం 4 వేల మంది జనాలు రాలేదనీ, ఒక సాధారణ ఎమ్మెల్యే అయినా నా పుట్టినరోజుకు 70 వేల మంది అభిమానులు తరలి వచ్చారని గుర్తు చేశారు. మీది పెత్తందార్ల పార్టీ అయితే మాది ప్రజల పార్టీ అనీ, ఆ ప్రజా బలంతోనే రానున్న ఎన్నికల్లో గెలవబోతున్నామని జోష్యం చెప్పారు. నా ఒత్తిడి వల్ల లాంకో పరిశ్రమ 15 రోజులు మూతపడిందని ఆరోపించిన చంద్రబాబు, ఆ ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. మరి నిరూపించలేకుంటే చంద్రబాబు తన పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్‌ విసిరారు. నిత్యం హైదరాబాదులో ఉండే సుధీర్‌ రెడ్డి నాన్‌ లోకల్‌ అనీ, నిరంతరం ప్రజల్లో ఉండే తాను లోకల్‌ అని చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో తాను చేసిన అభివద్ధిపై, 30 ఏళ్లలో బొజ్జల చేసిన అభివద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. ఇకనైనా చంద్రబాబు, లోకేష్‌, సుధీర్‌ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలనీ, లేకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలే గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ మిద్దెల హరి, ఆలయపాలక మండలి చైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు, ఉన్నం వాసుదేవ నాయుడు, గుమ్మడి బాలకష్ణయ్య, జయ గోపాల్‌, పసల సుమతి తదితరులు పాల్గొన్నారు.

➡️