బాబు, పవన్‌ ప్లాన్‌.. పెద్దిరెడ్డి కి చెక్‌..?

Feb 25,2024 22:11

శ్రీ కుప్పం ప్రతీకారంతో పక్కా స్కెచ్‌, సీటు ఆయనకే…ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి తారా స్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసిపి ఇప్పటికే పలు విడతల్లో వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అసెంబ్లీ ఎన్నికలకు సైఅంటూ ప్రతిపక్షాలకు సవాలు చేసింది. అయితే తెలుగుదేశం, జనసేన పార్టీల తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో శాసనసభ ఎన్నికల హీట్‌ ఒక్కసారిగా పెరిగింది. 2024 ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. జనసేన పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడంతో కథ రసవత్తరంగా మారింది. వైసిపి ఇంటికి పంపిస్తామని తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు ధీమాగా చెబుతున్నారు. ప్రజల ఆశీస్సులు తమకు ఉన్నాయని వైసిపి నాయకులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి చుక్కలు చూపించాలని నారా చంద్రబాబు నాయకుడు ప్లాన్‌ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత సోదరుడు, తంబళ్లపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యేపెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని నారా చంద్రబాబు నాయకుడు ప్లాన్‌ చేశారు. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు శంకర్‌ను కాదని మరో నాయకుడికి ఎమ్మెల్యే సీటు కేటాయించడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే లక్ష్మిదేవమ్మతో పాటు ఆమె కుమారుడు ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి కూడా టీడీపీ టిక్కెట్‌ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ వర్గం (బీసీ) కావడం, తంబళపల్లెలో ఓ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ చివరి నిమిషంలో ఎమ్మెల్యే సీటు ఇచ్చే విషయంలో అన్ని వైపుల ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ముళ్లును ముళ్లుతోనే తియ్యాలని, తంబళ్లపల్లెలో ఆ సామాజిక వర్గం ఓట్లు ఆ వర్గంతోనే చీలిపోయేలా చేయాలని ప్లాన్‌ చేసిన చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ చివరి నిమిషయంలో పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి మీద పోటీకి జయచంద్రా రెడ్డిని రంగంలోకి దింపారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో బలిజ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. తరువాత బీసీలు, మైనారీలు, ఎస్సీ,ఎస్టీలు ఓట్లు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీలిపోవడానికి, లోకల్‌, నాన్‌ లోకల్‌ ఫీలింగ్‌ వచ్చేలా దెబ్బ కొట్టాలని ప్లాన్‌ చేసిన చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి మీద పోటీకి జయచంద్రా రెడ్డిని రంగంలోకి దింపారు. ఇటీవల అధికారం అడ్డం పెట్టుకున్న వైసీపీ నాయకులు జయచంద్రా రెడ్డిని అనేక ఇబ్బందులకు గురిచేశారని, అధికారుల అండతో ఆయన్ను జిల్లా నుంచి బహిష్కరించాలని ప్లాన్‌ చేశారని పెద్ద టాక్‌ ఉంది. ఇదే విషయంలో స్థానికంగా జయచంద్రా రెడ్డి మీద సానుభూతి పెరిగిందని స్థానికులు అంటున్నారు. అయితే చివరి నిమిషయంలో రాజకీయ చాణుక్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కా ప్లాన్‌ చేసి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డిని గెలిపించుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సులభంగా విజయం సాధించిన పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అంత సులభంగా గెలిచే అవకాశం లేదని స్థానిక ఓటర్లు అంటున్నారు. తంబళ్లపల్లె నియోజక వర్గంలో భూముల లావాదేవీల విషయంలో, కాంట్రాక్టు పనులు కేటాయింపు విషయంలో, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసిపి మీద విసుగు చెందిన స్థానిక ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని తెలిసింది. తంబళ్లపల్లె నియోజక వర్గంలో 25 ఏళ్ల క్రితం నుంచి బీజేపీకి గట్టి పునాదాలు ఉన్నాయి. టీడీపీ, జనసేనకు బీజేపీ ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కుప్పంలో తనను దెబ్బకొట్టిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఫ్యామిలీ మీద దెబ్బ కొట్టడానికి అన్ని ఆలోచించిన చంద్రబాబు నాయకుడు మాజీ ఎమ్మెల్యే, బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న శంకర్‌కు నచ్చచెప్పి ఈసారి తంబళ్లపల్లె ఎమ్మెల్యే సీటు జయచంద్రా రెడ్డికి ఇచ్చారని తెలిసింది. మొత్తం మీద తంబళ్లపల్లె నియోజక వర్గంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయని ఓటర్లు అంటున్నారు.

➡️