ముర్రుపాలకు మోక్షంనేడు ‘మిల్క్‌ బ్యాంకు’ ప్రారంభం దాతృత్వం చాటుకుంటున్న రోటరీ క్లబ్‌ తల్లిపాలే ముద్దంటున్న వైద్యులు

Apr 2,2024 23:35
ముర్రుపాలకు మోక్షంనేడు 'మిల్క్‌ బ్యాంకు' ప్రారంభం దాతృత్వం చాటుకుంటున్న రోటరీ క్లబ్‌ తల్లిపాలే ముద్దంటున్న వైద్యులు

ముర్రుపాలకు మోక్షంనేడు ‘మిల్క్‌ బ్యాంకు’ ప్రారంభం దాతృత్వం చాటుకుంటున్న రోటరీ క్లబ్‌ తల్లిపాలే ముద్దంటున్న వైద్యులు ప్రజాశక్తి-తిరుపతి’ డబ్బా పాలొద్దు…తల్లిపాలే ముద్దు ‘ అనే నినాదం ఇకపై నిజం కానుంది. కళ్లు తెరవగానే తల్లి ‘పాల’కు దూరం కావాల్సిన అవసరం లేదు. రాయలసీమకే వైద్యరంగంలో తలమానికంగా నిలుస్తున్న తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో ఇకపై ముర్రుపాలూ లభ్యం కానున్నాయి. రోటరీ క్లబ్‌ దాతృత్వంతో రూ.30 లక్షల వ్యయంతో ప్రభుత్వ మెటర్నటీ వైద్యశాలలో బుధవారం ఉదయం ప్రారంభమయ్యే ‘ రోటరీ హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంకు ‘ ఇకపై తిరుపతి ప్రాంత పసిబిడ్డలకు కల్పతరువు కానుంది. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీషా, రోటరీ క్లబ్‌ డిస్ట్రిక్‌ గవర్నర్‌ ఉదరుకుమార్‌ భాస్కర, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నరసింహం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి శ్రీహరి, సుసేన హెల్త్‌ ఫౌండేషన్‌ సెక్రటరీ సంతోష్‌కుమార్‌ క్రాలేటి, మెటర్నటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జి పార్థసారధితో పాటు తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ అదితి సింగ్‌ హాజరుకానున్నారు. పుట్టగానే తల్లిపొత్తిల్లో ఒదిగి ముర్రుపాలు తాగాల్సిన బిడ్డలు దాదాపు 60 శాతం మంది తల్లిపాలకు నోచుకోవడం లేదని పలు సర్వేలు బహిర్గతం చేస్తున్నాయి. పుట్టిన వెంటనే ఇవ్వాల్సి ఉండగా రెండు మూడు రోజులు గడిచినా ఇవ్వడం లేదు. మొదటి ఆరునెలల వరకు తల్లిపాలు తాగుతున్న వారు కేవలం 46 శాతమే. పుట్టినప్పటి నుంచి కనీసం ఆరునెలలకు మించి ప్రతి తల్లి తమ బిడ్డలకు పాలు ఇవ్వాలి, కానీ ఆరునెలలు అటుంచితే ఆరు నిమిషాలు కూడా తల్లిపాలకు నోచుకోని చిన్నారులెందరో ఉన్నారు. కొన్ని సార్లు సిజేరియన్‌ వల్ల పిల్లలకు పుట్టగానే పాలు దక్కడం లేదు. దీంతో ఆ పిల్లలు అమ్మపాల రుచికి దూరమవుతున్నారు. ఉద్యోగం చేసే మరి కొందరు తల్లులు మొదటి ఆరు నెలలు తల్లిపాలు సంపూర్ణంగా ఇవ్వలేకపోతున్నారని పేర్కొంటున్నారు.ముర్రుపాలతోనే బిడ్డకు రోగ నిరోధక శక్తిపుట్టిన గంటలోపు తల్లిపాలు ఇస్తే బిడ్డకు రోగ నిరోధక శక్తి ఏర్పడుతుందని తిరుపతి రుయా వైద్యురాలు అరుణ పేర్కొంటున్నారు. చిక్కగా పసుపు రంగులో ఉండే ముర్రుపాలలో కొలోస్ట్రమ్‌ ఉంటుందని చెబుతున్నారు. ముర్రుపాలను కొందరు పిండిపారపోస్తారని, అది సరైనది కాదని వైద్యులు అంటున్నారు. పౌష్టికరం, బలవర్థకమైన ముర్రుపాలు తాగేది కొందరు మాత్రమే. పుట్టిన గంటలోపు తల్లిఒడికి చేరడం లేదు. దీంతో ముర్రుపాలు దక్కడం లేదు. ఆస్పత్రుల్లో ఆలస్యంగా బిడ్డ తల్లిఒడికి చేరుతుంది. స్నానం పేరుతో వైద్యపరీక్షల పేరుతో కొందరు బిడ్డను తల్లి ఒడికి చేర్చడం లేదు. తిరుపతిలో ఇటీవల ఓ స్వచ్చంధ సంస్థ నిర్వహించిన సర్వేలో కేవలం 60 శాతం మాత్రమే పుట్టిన గంటలోపు తల్లిపాలు తాగుతున్నట్లు తేలింది. అయితే వైద్యుల అంచనా ప్రకారం 36 శాతమే మాత్రమే చిన్నారులు ముర్రుపాలకు నోచుకుంటున్నట్లు స్పష్టం చేస్తున్నారు. మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌ పెరగడానికి తల్లిపాలు ఇవ్వకపోవడమేనని వైద్యులు పేర్కొంటున్నారు. తల్లిపాలు ఇస్తే రొమ్ము క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌, రక్తహీనత, ఎముకల బలహీనత నుంచి రక్షణ, సహజ గర్భనిరోధక శక్తి, అధిక బరువు వంటి సమస్యల నుంచి కాపాడుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం బ్రెస్టు క్యాన్సర్‌ పెరగడానికి 30 శాతం తల్లిపాలు ఇవ్వకపోవడమేనని వైద్యులు వివరిస్తున్నారు. తల్లిపాలు రెండేళ్లపాటు నిరంతరంగా ఇస్తే శిశువులో వ్యాధినిరోధక శక్తి విశేషంగా పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఆ తల్లిలోనూ గర్భనిరోధక శక్తి పెరుగుతుందని, దీని వల్ల వెంటనే గర్భం రాకుండా నివారించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. సిజేరియనూ కారణమే ! ఆస్పత్రుల్లో డెలవరీల్లో 40 శాతం సిజేరియన్‌ అవుతున్నాయి. ఆపరేషన్‌ తర్వాత బిడ్డలను తల్లివద్దకు వెంటనే చేర్చడం లేదు. దీంతో శిశువు పుట్టిన గంటలో తల్లిపాలకు నోచుకోవడం లేదు. జిల్లాలో ప్రతి ఏడాదీ దాదాపుగా 2.30 లక్షల మంది జన్మిస్తున్నట్లు సమాచారం. ఇందులో దాదాపుగా 70 వేల మందికి పుట్టిన గంటలో తల్లిపాలకు నోచుకోవడం లేదు. వీరిలో ఎక్కువ శాతం సిజేరియన్‌తో పుట్టిన వారే. తల్లి ఐసియులో ఉంటే, బిడ్డ ఇంక్యుబెటర్‌లో ఉంటున్నారు. ఇలా రెండు మూడు రోజుల వరకు పిల్లలు తల్లిపాలకు నోచుకోవడం లేదు. మరికొన్ని ఘటనల్లో బిడ్డలు బరువు తక్కువ, నెలలు నిండక పోవడం వల్ల కూడా తల్లిపాలకు నోచుకోవడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. పాలపౌడర్‌, పాలపీపాలతో కొన్నిసార్లు ప్రమాదం పొంచి ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బ్రాండెడ్‌ కంపెనీకి సంబంధం లేని పాలడబ్బాలు, పాలపీపాల వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నట్లు పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని ప్లాస్టిక్‌ బాటిల్స్‌, పాల పీపాలతో ప్రమాదం పొంచి ఉందంటున్నారు.రెండేళ్లపాటు తల్లిపాలే ఇవ్వాలి : డాక్టర్‌ ఈశ్వరయ్య, ప్రముఖ చిన్నపిల్లల వైద్యనిపుణులు, రుయా ఆసుపత్రి, తిరుపతి పుట్టిన బిడ్డకు రెండేళ్లపాటు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలి. బిడ్డ పుట్టగానే చుక్కపాలు కూడా వృధా చేయకుండా వెంటనే ఇవ్వాలి. మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు తప్ప ఆవు, బర్రె, డబ్బాపాలనూ ఇవ్వొద్దు. ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు తల్లిపాలతో పాటు ఇంట్లో తయారు చేసిన తేలికపాటి ఆహారం ఇవ్వాలి. పాలను పిల్లలకు ఇక వ్యాక్సిన్‌గా ఇవ్వాలి. పాలు ఇవ్వడం వల్ల అది వారికి ఒక రక్షగా ఉంటుంది. పాలు తాగిన పిల్లలకు 500 కేలరీల శక్తి వస్తుంది. చాలామంది అపోహతో బిడ్డకు పాలు ఇవ్వడం లేదు. తల్లిపాలు తాగే బిడ్డ పుట్టిన సమయంలో ఉండే బరువు, అయిదు నెలల వయస్సు వచ్చేవరికి రెట్టింపు పెరుగుతారు. అదే ఏడాదికి మూడు రెట్లు అధిక బరువు పెరుగుతారు. దీన్ని గుర్తించి తల్లులూ ఇకపై దాతృత్వం చాటుకుని పాలను దానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

➡️