యాక్ట్‌ సెక్షన్‌ 30 నిరవధిక అమలుపై…నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు

యాక్ట్‌ సెక్షన్‌ 30 నిరవధిక అమలుపై...నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు

యాక్ట్‌ సెక్షన్‌ 30 నిరవధిక అమలుపై…నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుప్రజాశక్తి-తిరుపతి(మంగళం)రాజ్యాంగబద్దంగా పాలన కొనసాగినప్పుడే ప్రజలకు సుపరిపాలన అందుతుందని’సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాసంఘాలపై నిర్బంధం విధిస్తూ యాక్ట్‌ సెక్షన్‌ 30 నిరవధిక అమలుపై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 13న రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించాలని ‘సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ’ కార్యవర్గం నిర్ణయించిందన్నారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యవర్గ సమావేశం తిరుపతిలో శనివారం సంస్థ అధ్యక్షులు , ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జి. భవానీ ప్రసాద్‌ అధ్యక్షతన జరిగింది. అనంతరం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ హింసకు తావులేకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఎన్నికలు జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో ప్రతిపక్ష రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల కార్యకర్తలపై ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులను బనాయించడంపై సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30ను నిరవధికంగా అమలు చేయడంపై, రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులపై, కార్యకర్తలపై పెడుతున్న పోలీసు కేసులలోని వాస్తవాలను తెలుసుకోవడానికి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కోసం కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా పనిచేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎంవి. భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్‌ పూర్వ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ అనగాని సత్య ప్రసాద్‌, హిందూ దినపత్రిక పూర్వ రెసిడెంట్‌ ఎడిటర్‌ వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించి విభిన్న వర్గాల వారితో సంప్రదింపులు జరిపి కేసు మోపబడిన వారి వద్ద నుండి వాస్తవాలను సేకరిస్తుందన్నారు. ఈ నెల 13న విజయవాడలో త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఒక రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేయాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించామన్నారు. బాధిత పక్షాలు, బాధితులు వారి అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ దష్టికి స్వతంత్రంగా తీసుకురావచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయకార్యదర్శి వి.లక్ష్మణరెడ్డి, కోశాధికారి ఇ .ఫల్గుణ కుమార్‌ , పూర్వ డిజిపి ఎం.వి. కృష్ణారావు పాల్గొన్నారు.

➡️