సిద్ధం కండి.. జగన్‌ను ఓడించండి

Mar 27,2024 21:52
సిద్ధం కండి.. జగన్‌ను ఓడించండి

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, పలమనేరు ‘యాభై ఏళ్లకే బీసీలకు పింఛన్‌’ ఇస్తానని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీ ఇచ్చారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండు రోజుల పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం పలమనేరు, సాయంత్రం నగరిలో ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలను ఉద్ఘాటించారు. తాము అధికారంలోకి వస్తే పవర్‌లూమ్స్‌, చేనేత కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామన్నారు. నగరిలో టెక్స్‌టైల్‌ పార్కు తీసుకొస్తామన్నారు. 50 ఏళ్లు నిండిన బిసీలకు పింఛన్‌ ఇస్తామన్నారు. రైతులకు అన్నదాత పథకం కింద ప్రతి ఏటా 20వేలు జమ చేస్తూ, డ్రిప్‌, సబ్సిడీలు ఇస్తూ తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. నేతం సుగర్‌ ఫ్యాక్టరీ ఇవ్వాల్సిన బకాయిలను వడ్డీతో సహా ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘దీపం’ పథకం కింద ఏడాదికి మహిళలకు మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామన్నారు. బస్సు సౌకర్యం ఉచితంగా కల్పిస్తామన్నారు. అధికారంలోకి వస్తే కరెంట్‌ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక తొమ్మిదిసార్లు కరెంట్‌ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పెట్టి పేదవాని కడుపు నింపే కార్యక్రమం చేపడతామన్నారు. ‘సిద్ధం’ బోర్డు పెట్టి అందరినీ మోసం చేస్తున్నారని, మేము ఇపుడు సిద్ధమయ్యాం మిమ్మల్ని ఇంటికి పంపడానికి అని రాయలసీమలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్‌రెడ్డిని నిలదీయండి..’ అని పిలుపునిచ్చారు. రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా చేస్తానన్నారు. నగరిలో టెక్స్‌టైల్‌ పార్కు పెట్టి చేనేతలను ఆదుకుంటామన్నారు. వడమాలపేటకు పారిశ్రామికవాడ తీసుకొస్తానన్నారు. నగరిలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామన్నారు. నగరి ఎంఎల్‌ఎ ఆర్‌కె రోజా ఓ సాటి మహిళకు ఛైర్‌పర్సన్‌ పదవి ఇప్పిస్తానని 40 లక్షలు డబ్బు తీసుకున్నారన్నారు. చిత్తూరు ఎంపి అభ్యర్థి దుగ్గిమళ్ల ప్రసాద్‌రావు, పలమనేరు అసెంబ్లీ అభ్యర్థి ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, నగరి అసెంబ్లీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌, సత్యవేడు, జీడీనెల్లూరు అసెంబ్లీల అభ్యర్థులు ఆదిమూలం, థామస్‌, పార్టీ జిల్లా అధ్యక్షులు సిఆర్‌ రాజన్‌ పాల్గొన్నారు. అక్కడనుంచి అన్నమయ్య జిల్లాకు బయల్దేరి వెళ్లారు. నగిరిలో టిడిపి నాయకులు గంజి మాధవయ్య, గాలి జీవరత్నం నాయుడు, చినబాబు, డిజి ధనపాల్‌, ఎంఎన్‌ ధనపాల్‌ పాల్గొన్నారు. పలమనేరులో మాట్లాడుతూ రైతులకు సబ్సిడీలు అందట్లేదని, బిందు సేద్యం పరికరాలు అందుతున్నాయా? అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి రుణాలు అందాయా? అని సభికులను అడిగారు. మీ బతుకుల్లో చీకటి నింపిన వ్యక్తులను గుర్తించాలని, ముసుగు వీరుడు పరదాలు దాటి బయటకు వస్తున్నాడని, జగన్‌కు ఖాళీ వీధులు స్వాగతం పలకాలన్నారు. ఒక్కసీమ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. టిడిపి హయాంలో 90 శాతం ప్రాజెక్టులను పూర్తిచేస్తే, జగన్‌ 10శాతం కూడా పూర్తి చేయలేదన్నారు. ఉమ్మడి చిత్తూరులో 25 ప్రాజెక్టులను జగన్‌ రద్దు చేశారన్నారు. జగన్‌ను ఇంటికి పంపేందుకు మేమంతా సిద్ధం అని జనం రాయలసీమకు రాకుండా అడ్డుకోవాలన్నారు. ప్రజాగళాన్ని మొదటగా పలమనేరులో ప్రారంభించానని, పలమనేరు మీటింగ్‌ సూపర్‌హిట్‌ అని, ఎక్కడ చూసినా జనమేనన్నారు. రాష్ట్రం కోసం ఎన్డీఎలో చేరితే మమ్మల్ని జగన్‌ విమర్శిస్తున్నాడని, తాము గతంలో ఎన్డీయేలో ఉన్నపుడు మైనార్టీలకు అన్యాయం జరగలేదన్నారు. ఎక్కడ భూములు కనిపించినా వైసిపి నాయకులు వదలట్లేదని, ఆలయ భూములను కబ్జా చేస్తున్నారని, చివరికి ఇళ్లనూ కబ్జా చేసే పరిస్థితి వస్తుందన్నారు. రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా చేస్తానని, బెంగుళూరు, చెన్నరు నగరాలను తలపించేలా అభివృద్ధి సాధించే రంగాలను తీసుకొస్తానన్నారు. మీడియా వాహనానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం వి.కోట : కుప్పం నుంచి పలమనేరుకు వెళుతున్న మీడియా వాహనం వి.కోటలో రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. వి.కోట పట్టణ సమీపంలోని ముదిమడుగు గ్రామం నుంచి ట్రాక్టర్‌ కుప్పం ప్రధాన రహదారిలోకి ఉన్నపళంగా రావడంతో కుప్పం వైపు నుంచి వస్తున్న టెంపో ట్రావెలర్‌ అదుపు చేయలేక రెండు వాహనాలు ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో టెంపో ట్రావెలర్‌ డ్రైవర్‌ తిరుపతికి చెందిన సంజీవ్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. హెచ్‌ఎం టివి కెమెరామెన్‌కు గాయాలయ్యాయి. మిగిలిన మీడియా మిత్రులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఢకొీన్న తీవ్రతకు ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడింది. ఏదిఏమైనా పెను ప్రమాదం తప్పడంతో మీడియా మిత్రులు ఊపిరి పీల్చుకున్నారు. వి.కోట ఎస్‌ఐ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులను ఇతర వాహనాల్లో పలమనేరుకు మీటింగ్‌కు తరలించారు.

➡️