15 నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’

Nov 28,2023 22:54
15 నుంచి 'ఆడుదాం ఆంధ్ర'

క్రీడాపోటీలకు 15 సంవత్సరాలు నిండిన వారు అర్హులు 1902 నెంబర్‌కి కాల్‌ చేసి రిజిష్ట్రేషన్‌ చేసుకోవచ్చు: కలెక్టర్‌ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 15 సంవత్సరాల వయస్సు నిండిన యువత పాల్గొనేలా 51రోజులు పాటు క్రీడాపోటీలను నిర్వహించనున్నదని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ తెలిపారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం నిర్వహణపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని నింపేలా, మారుతున్న జీవనశైలిలోని ఒత్తిడిలను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర ద్వారా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం 2023 డిసెంబర్‌ 15 నుండి 2024 ఫిబ్రవరి 3వ వరకు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా క్రికెట్‌, వాలీబాల్‌, బాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖో క్రీడలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, 15 సంవత్సరాల వయసు నిండి ఆసక్తి కలవారు పోటీలలో పాల్గొనవచ్చునని తెలిపారు. రాష్ట్రస్థాయిలో 3లక్షల పోటీలు జరగనున్నాయని, ఇందులో జిల్లాలో దాదాపు 10వేల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో పాల్గొని గెలిచిన వారికి మండల స్థాయిలో, మండల స్థాయిలో గెలిచిన వారికి జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయిలో గెలిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. పోటీలలో గెలిచిన వారికి నగదు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పోటీలలో పాల్గొనలేని వారి కొరకు యోగా, మారథాన్‌ వంటివి నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడలలో భాగంగా క్రీడాకారులకు కావలసిన సామగ్రిని ప్రభుత్వం సమకూర్చడం జరుగుతుందని, సచివాలయ పరిధిలో క్రీడాకారులకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉంచడం, ఆట మైదానాలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమానికి సచివాలయ పరిధిలో విలేజ్‌ లెవెల్‌ ఆర్గనైజర్‌గా పంచాయతీ సెక్రెటరీలు, మండల స్థాయిలో ఎంపిడిఓలు, నియోజకవర్గంలో ఆర్డిఓలు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఛైర్మన్లుగా వ్యవహరించడం జరుగుతుందని, డీఈఓల సమన్వయంతో క్రీడాకారులకు పోటీలలో నియమ నిబంధనలపై శిక్షణ ఇవ్వడానికి, సక్రమంగా నిర్వహించడానికి ఫిజికల్‌ డైరెక్టర్లు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు, శాప్‌ అధికారులను ఏర్పాటు చేయడం, డిపిఓల ద్వారా డిఎల్‌డిఓలను సమన్వయం చేసుకుని ఆట మైదానాలను ఎంపిక చేసుకోవడం, వైద్యశాఖ ద్వారా ప్రథమ చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ‘ఆడుదాం ఆంధ్ర’ కొరకు రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైందని, వెబ్సైట్‌ ద్వారా, 1902 నెంబర్‌కి కాల్‌చేసి రిజిష్ట్రేషన్‌ చేసుకోవచ్చునని, ఆఖరు తేది 2023 డిసెంబర్‌ 10వ తేదీ అని తెలిపారు. ఒక క్రీడాకారుడు గరిష్టంగా2 క్రీడలకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చునని తెలిపారు. ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో ఈకార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు క్రీడలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించడం లేదని తెలిపారు. పోటీలు నిర్వహించే సమయంలో క్రీడాకారులకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోటీలు నిరహించే సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.

➡️