అభ్యర్థుల ఎన్నికల వ్యయంతడిచి మోపెడు..!

Apr 10,2024 22:54
అభ్యర్థుల ఎన్నికల వ్యయంతడిచి మోపెడు..!

శ్రీ రోజుకు రూ.700పైన ఇస్తేనే ప్రచారానికిశ్రీ ప్రతిరోజూ మందు, విందుశ్రీ రోజుకు 40-50 లక్షలపైనే ఖర్చుశ్రీ తలలు పట్టుకుంటున్న అభ్యర్థులుఎన్నికల రథం… దానికి డీజే సౌండ్‌ బాక్స్‌లు, పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్స్‌, ఫ్లెక్సీలు, ర్యాలీలు, వాటి వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌…ఇక ప్రచారానికి మనుషులు, వారితో పాటు కార్యకర్తలకు, ద్వితీయ స్థాయి నాయకులకు మందు, విందు.. ఇలా ఎన్నికల్లో అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. భారీగా పెరిగిన ఖర్చులతో అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి ఎన్నికల వ్యయం మొత్తం రూ.40లక్షలలోపే ఉండాలనీ ఎన్నికల కమిషన్‌ నిబంధన విధించినప్పటికీ … ఒక్కో అభ్యర్థి ఒక్కరోజులోనే 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తుండటం గమనార్హం.ప్రజాశక్తి – తిరుపతిప్రచారానికి రూ.700-1000 ఇస్తేనే..నాయకులతో పాటు తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మనుషులకు గతంలో రోజుకి 500 నుంచి 700 ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కనీసం 700 నుంచి 1000 రూపాయలు ఇస్తేనే గాని మనుషులు దొరికే పరిస్థితి లేదంటూ అభ్యర్థులు వాపోతున్నారు. ఇలా నియోజక వర్గం అంతా ప్రచారం చేసే మనుషులకి రోజుకి సుమారు 10 లక్షల వరకు ఖర్చు అవుతున్నట్లు సమాచారం.ఇక చిన్నపాటి సభలు, సమావేశాలకు ఒక్కో చోట కనీసం రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పెడుతున్నారు. ఇది కాక వార్డుస్థాయిలో ప్రచారం చేసేందుకు అయ్యే ఖర్చులను అభ్యర్థులు బూత్‌స్థాయి నేతలకు ఇస్తున్నారు. ఒక్కో వార్డుకూ ఈ ఖర్చు దాదాపుగా రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటోందని సమాచారం. ఉదాహరణకు తిరుపతి నగరంలో ఓ ప్రధాన అభ్యర్థి వార్డ్‌ స్థాయి ప్రచారానికే రోజూ సుమారు రూ.20-25 లక్షల మధ్య ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇక చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి రోజువారీ ఖర్చు రూ.50 లక్షల దాకా ఉంటున్నట్టు సమాచారం. తన నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో పార్టీ కార్యాలయాన్ని, సమీపంలోనే ఓ వంటశాలను కూడా ఏర్పాటు చేశారు. నిత్యం అక్కడ సుమారు 200 నుంచి 300 మంది వరకూ కార్యకర్తలకు భోజనం చేస్తున్నారు. అలా.. ఒక్క భోజన ఖర్చే రోజుకు రూ.లక్షల్లో అవుతోంది.’ట్రెండు’మారిందిసాధారణంగా అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారానికి వచ్చినప్పుడు స్థానికంగా ఉండే నేతలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అంతా తామై వ్యవహరిస్తుంటారు. ఆయా గ్రామాల్లో ప్రచారానికయ్యే వ్యయాన్ని వారే భరించేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. గ్రామ, వార్డు స్థాయిలో అయ్యే ఎన్నికల ప్రచార వ్యయాన్ని ఇప్పుడు అభ్యర్థులే భరించాల్సిన పరిస్థితి. వారు ప్రచారానికి వచ్చినప్పుడు వారికి వేసే పూల దండలు, డీజే సౌండ్‌, డప్పులు, టపాసుల ఖర్చు అంతా ఇప్పుడు అభ్యర్థులే స్వయంగా పెట్టుకుంటున్నారని ఓ కార్యకర్త తెలిపారు.మందు , విందుల హోరుప్రచారంలో పాల్గొనే మనుషులు, కార్యకర్తలకు రోజుకు రెండు పూటలా మందు విందులు ఇవ్వాల్సిందేనని అభ్యర్థులు బావురు మంటున్నారు. ఒక్కో బిర్యాని ప్యాకెట్టు కనీసం 100 నుంచి 150 రూపాయలు పెడితేనే కానీ కుదరదు అంటూ వాపోతున్నారు. ఇక మందు విషయానికొస్తే ”మాకు లోకల్‌ బ్రాండు వద్దు…మంచి బ్రాండులే కావాలి” అంటూ డిమాండ్‌ చేసి మరి కొనిపించుకుంటున్నారు. ఇక కుల సంఘాల, ఆత్మీయ సమావేశాలు అంటూ నిర్వహిస్తున్న మీటింగులకు ప్రతిరోజు ఐదు నుంచి పది లక్షల వరకు ఖర్చవుతుంది. అలాగే పగలంతా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు రాత్రి వేళల్లో మాత్రం ముఖ్య నాయకుల బుజ్జగింపులు, పోల్‌ మేనేజ్మెంట్‌ మీటింగ్‌ కు సంబంధించి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన వస్తుండడం గమనార్హం. ఇలా ప్రతిరోజు 40 నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతున్నట్లు తిరుపతిలోని ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి బాహాటంగా వాపోతుండటం గమనార్హం. జనరల్‌ కేటగిరి లు కాకుండా రిజర్వుడు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మాత్రం ఖర్చు విషయంలో కాస్త ఊరట లభిస్తుందనండం గమనార్హం.

➡️